హైవేపై ధాన్యం పోసి రైతుల నిరసన

హైవేపై ధాన్యం పోసి రైతుల నిరసన
  • వర్షాలు పడుతున్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆవేదన
  • తమ ధాన్యం వెంటనే కొలుగోలు చేయాలని డిమాండ్

ఒక పక్క వర్షాలు వస్తుంటే.. ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని వికారాబాద్ జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. పరిగిలోని హైదరాబాద్ టూ బీజాపూర్ హైవేపై వరి ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. తమ వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై రాళ్ళు వేసి బైటాయించారు. రైతుల నిరసనతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక వైపు ధాన్యం అన్‌లోడ్ చేసేందుకు వచ్చిన దాదాపు ఐదు వందల వాహనాలు, మరో వైపు రైతుల రాస్తారోకోతో నిలిచిన వాహనాలతో హైవేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటుగా వస్తున్న కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేదిలేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకోకపోగా.. రైతులను నేరుగా మిల్లు దగ్గరకు పంపించడంతో ఈ సమస్య తలెత్తింది. ధాన్యం కొనుగోల్లు ఆపేశామని సదరు రైస్ మిల్లర్ మిల్లు ముందు బోర్డు పెట్టడంతో రైతులు గందరగోళంలో పడిపోయారు. గత వారం రోజులుగా ధాన్యం లోడ్‌తో ఉన్న వాహానాలు అన్‌లోడ్ కోసం వేచి చూస్తున్నాయి. అంతేకాకుండా తాలు ఉందని, తేమ శాతం అధికంగా ఉందని సంచికి రెండు నుండి నాలుగు కిలోల మేర తరుగు తీస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కిరాయి వాహనాల్లో ధాన్యం తెచ్చి వెయిటింగ్ చార్జీలు కడుతున్నామని... ఇన్ని సమస్యలుంటే తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. ఏంచేయాలో తెలియకే రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే తమ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలంటూ, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి మిల్లరుతో మాట్లాడి.. రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.