ముషీరాబాద్, వెలుగు : జీవో 81 ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 61 ఏండ్లు నిండిన వీఆర్‌ఏ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, వీఆర్ఏ వారసుల జేఏసీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చారని, కానీ 28 నెలలు గడిచినా హామీని నేరవేర్చలేదని మండిపడ్డారు. వీఆర్‌ఏ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అంతకుముందు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. సి.రాజేందర్, జిల్లపల్లి అంజి, మోడీ రాందేవ్ పాల్గొన్నారు.
