- 2022లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో వార్తల్లోకి
- నాడు బీజేపీతో వంద కోట్ల డీల్‌పై రహస్య మంతనాలు
- వీడియోలు బయటకు రావడంతో రాష్ట్రంలో సంచలనం
- ఇప్పుడు అదే ఫాంహౌస్‌లో డ్రగ్స్‌తో దొరికిపోయిన రోహిత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ హాట్ టాపిక్‌గా మారింది. డ్రగ్స్ తీసుకుంటూ రోహిత్‌రెడ్డి ఈగల్ టీమ్‌కు అడ్డంగా దొరికిపోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదే ఫాంహౌస్‌లోనే.. సరిగ్గా మూడున్నరేండ్ల క్రితం ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారమూ బయటపడింది. మునుగోడు బై ఎలక్షన్స్‌కు ముందు 2022 అక్టోబర్‌లో జరిగిన ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది.
బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు రాష్ట్రమంతటా గుప్పుమన్నాయి. ఈ వ్యవహారమంతా కేంద్రంలో కీలకంగా ఉన్న బీఎల్ సంతోష్ కనుసన్నల్లోనే జరిగిందన్న చర్చోపచర్చలూ జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పైలెట్ రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజును బీజేపీలో చేర్చుకునేందుకు వంద కోట్ల డీల్.. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లోనే జరిగినట్టు రహస్య మంతనాల వీడియోలు బయటకు లీకయ్యాయి.
బీఆర్‌ఎస్ అధిష్టానమే ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసి.. కొనుగోళ్ల వ్యవహారం తెలుసుకుని ఆ ఎమ్మెల్యేలతోనే రహస్యంగా వీడియోలు తీయించి బయటకు లీక్ చేశారనే చర్చ కూడా జోరుగా సాగింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బీఆర్‌ఎస్ పార్టీ అదే అస్త్రాన్ని వాడుకున్నది. బీజేపీ ప్రభుత్వం వంద కోట్లకు ప్రలోభపెట్టినా.. తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదంటూ ప్రచారంలో ఆ పార్టీ నేతలు ఊదరగొట్టారు. ఆ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన ప్రచార సభల్లో ప్రజలకు చూపించి మరీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఎఫెక్ట్‌తోనే మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గట్టెక్కిందని, లేదంటే ఆ ఎన్నికల్లోనూ ఓడిపోయి ఉండేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగానే నడిచింది.
ఇప్పుడూ అదేచోట..
తాజాగా శనివారం రాత్రి అదే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు అడ్డంగా దొరికిపోయారు. ఇందులో టీడీపీకి చెందిన ఏపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కూడా ఉన్నారు. అందరికీ డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఓ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడం, ఆ ఫాంహౌస్ కూడా వివాదాలకు కేరాఫ్‌గా ఉండడంతో..ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు పొగపెట్టినట్టయింది.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం కావడం, పార్లమెంట్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని డీలా పడిన ఆ పార్టీకి.. కవిత రూపంలో ముప్పు ముంచుకొస్తున్నది. ఆమె బీఆర్‌ఎస్ పార్టీని టార్గెట్‌గా చేసుకుంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ చాలదన్నట్టు మళ్లీ డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేతే దొరకడంతో.. ఆ ఉచ్చు కూడా బీఆర్‌ఎస్ మెడకు చుట్టుకుంటున్నదన్న చర్చ నడుస్తున్నది.
పొలిటికల్ సర్కిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న మాట వాస్తవమంటూ పలువురు కీలక నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వచ్చిన ఆరోపణల నుంచే బయటపడేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఇప్పుడు మరింత డ్యామేజ్ చేసేలా ఈ వ్యవహారం జరిగింది. అయితే, ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని, డ్రగ్స్‌కు తాము వ్యతిరేకమని కేటీఆర్ ప్రకటన చేసినా.. మరి, ఆ డ్రగ్స్ మరకను చెరిపేసుకునేందుకు రోహిత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ డ్రగ్స్ వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ నేతలు చర్చించినట్టు కూడా తెలుస్తున్నది.
