- ట్రాన్స్ జెండర్ స్టూడెంట్లకూ ఇచ్చే యోచన
- ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కాలర్ షిప్
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు?
- సర్కారుకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దివ్యాంగ, ట్రాన్స్జెండర్, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఇంటర్ విద్యాశాఖ రెండు కొత్త స్కీంలు అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదనలు పంపించింది. ఈ పథకాలు ఇస్తే గవర్నమెంట్కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది.
1.72 లక్షల మంది స్టూడెంట్లు
రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. వీటిలో 1.72 లక్షల మంది స్టూడెంట్స్చదువుతుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ విద్యాసంవత్సరం గతేడాదితో పోలిస్తే 11వేల అడ్మిషన్లు పెరిగాయి. ఈ క్రమంలోనే విద్యార్థులకు మరింత చేరువ కావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సర్కారు కాలేజీల్లో మెరిట్ విద్యార్థినులకు కొత్తగా స్కాలర్‌షిప్ స్కీం తీసుకురావాలన్న ఆలోచన చేస్తోంది.
సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థినులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేయకుండా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. టెన్త్ లో వచ్చే మార్కుల ఆధారంగా 40 వేల మందికి రూ.2,500 చొప్పున స్కాలర్షిప్ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకు రూ.10 కోట్ల బడ్జెట్ కావాలని ఇంటర్విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఇటీవలే సర్కారుకు ప్రతిపాదించారు.
స్కూటీలతో అండగా నిలవాలని..
నడవలేక, దృష్టి లోపం, వినికిడి లోపం, ఆటిజం తదితర వైకల్యాలతో బాధపడే విద్యార్థులకు అండగా నిలవాలని ఇంటర్విద్యాశాఖ నిర్ణయించింది. అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్లను పంపిణీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీనివల్ల ఈ స్టూడెంట్లు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా తమ విద్యాసంస్థలకు చేరుకునే అవకాశం కలుగుతుందని అంటున్నారు. తొలుత నడవలేని స్థితిలో ఉన్న 1,000 మంది విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో వాహనానికి రూ.50 వేల చొప్పున.. మొత్తం రూ.5 కోట్లు కేటాయించాలని కోరారు. వీరితో పాటు ట్రాన్స్ జెండర్ విద్యార్థులకూ ఈ స్కీంను వర్తింపజేయాలని చూస్తున్నారు. సర్కారు పర్మిషన్ ఇస్తే ఈ పథకాలను వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభించనున్నారు.
