- కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్ చేయాలి
- ఆర్‍ఎంయూలో అయోధ్యపురం గ్రామస్తులు, రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
వరంగల్, వెలుగు : ‘కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్ చేయాలి, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి’ అని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ రైతుల భూములు సేకరించిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహానిరసన దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. నిరసన దీక్షకు హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన వారికి అర్హత ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సబ్‌డివిజన్‌గా కొనసాగుతున్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తాను సైతం కేంద్రంతో మాట్లాడి డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రైల్వే జేఏసీ నేతలు మాట్లాడుతూ.. కాజీపేట అయోధ్యపురం రైతులు ఎందుకు భూములు కోల్పోయారనేది ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన వారే కాకుండా.. స్థానికులకు సైతం ఆర్‍ఎంయూలోనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే.. త్వరలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయంపై త్వరలోనే తీర్మానం చేయబోతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ నేతలు కొండ్ర నర్సింగరావు, కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, గాదం యాదగిరి, ఇలాసాగరం ప్రదీప్ పాల్గొన్నారు.
