అన్నపురెడ్డిపల్లి, వెలుగు: ధాన్యం కొనుగోలులో ఆంక్షలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంటలో శుక్రవారం జాతీయ రహదారిపై పురుగుమందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. తరుగు పేరుతో ధాన్యం కొనుగోళ్లను లేట్ చేస్తున్నారని వాపోయారు. అకాల వర్షాలు కురిస్తే భారీ నష్టం వాటిల్లుతుందని వాపోయారు. తహసీల్దార్ స్వర్ణ అక్కడికి చేరుకుని సమస్యను జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
అధికారుల ఘెరావ్..
గుంపెన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన జిల్లా సరఫరా అధికారి ప్రేమ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి త్రినాథ్ బాబుతో రైతులు వాగ్వాదానికి దిగారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించే వరకు కదలనీయబోమని అడ్డుకుని బైఠాయించారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 14 గ్రామపంచాయతీల రైతులు పాల్గొన్నారు.

