అశ్వారావుపేట, వెలుగు: మండల పరిధిలోని ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువు కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు సోమవారం తహసీల్దార్ కిశోర్ నిర్వాసితులతో మాట్లాడారు. తహసీల్దార్ ఆఫీస్లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో పాటు బాధిత గిరిజన, గిరిజన నేతర రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు 2013 భూ సేకరణ చట్టం కింద గిరిజన రైతులకు ఎకరాకి రూ.10 లక్షల 80 వేలు, గిరిజన నేతర రైతులకు ఎకరానికి రూ.22 లక్షల 50 వేలు చెల్లించేలా నిర్ణయించారు.
152 మందికి చెందిన 72 ఎకరాల ఒక గుంట భూములకు పెంచిన నష్టపరిహారాన్ని ఇచ్చే విధంగా నిర్ణయించారు. భూముల నష్టపరిహారం పెంపును బాధిత రైతులంతా ఒప్పుకోవటంతో ఇన్నాళ్లూ పెండింగ్లో ఉన్న నష్టపరిహారం సమస్య పరిష్కారమైంది. త్వరలోనే వెంకమ్మ చెరువు కాలువ పనులకు మోక్షం లభించనున్నదని తహసీల్దార్ కిశోర్, డీఈఈ ఎస్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
