ఇసుక తవ్వకాల పర్మిషన్లు రద్దు చేయాలె

ఇసుక తవ్వకాల పర్మిషన్లు రద్దు చేయాలె

మహబూబ్​నగర్​/మిడ్జిల్​, వెలుగు: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రైతులు గోస పడుతున్నారు. ఇప్పటికే వాగులు ఎండిపోవడం, సాగునీటి కాల్వలకు నీళ్లు బంద్​పెట్టడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో బావులు, బోర్లనీటి ద్వారా పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైనింగ్, టీఎస్‌‌‌‌‌‌‌‌ఎండీసీ ఆఫీసర్లు పూడికతీత పేరుతో వాగులపొంటి ఇసుక తవ్వకాలకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు.  ఇప్పటికే వాగులు ఎండిపోవడంతో బోర్లు ధారలాగా పోస్తున్నాయని, ఇసుకను తవ్వేస్తే పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. వెంటనే పర్మిషన్ రద్దు చేయాలని డిమండ్ చేస్తున్నారు. 

దుందుభి పరిధిలోనే..

మహబూబ్​నగర్​జిల్లా మిడ్జిల్​ మండలంలో దుందుభి వాగు పారుతుంది. వాగును నమ్ముకొని సింగందొడ్డి, దోనూర్, పస్పుల, వాడ్యాల, మున్ననూర్, మిడ్జిల్, అయ్యవారిపల్లి, వెలుగోముల, చిల్వేర్​, కొత్తూరు గ్రామాల రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ గ్రామాల పరిధిలో ఇప్పటికే చెక్​ డ్యామ్​లు ఉండగా, అయ్యవారిపల్లి వద్ద కొత్త చెక్​డ్యామ్​ను నిర్మిస్తున్నారు. ఈచెక్​డ్యామ్​ వెనకాలే రెండు కిలోమీటర్ల దూరంలో చిల్వేర్​ చెక్​ డ్యామ్​ ఉండగా, ఇక్కడి నుంచి అయ్యవారిపల్లి చెక్​ డ్యామ్​ మధ్యలో టీఎస్​ఎండీసీ ఇసుక పూడికతీతకు టెండర్లు పిలిచింది.  ఎర్రజెండాలు పాతి ఆ పరిధిలో ఒకటిన్నర మీటరు వరకు ఇసుక తవ్వకాలు చేసుకోడానికి కాంట్రాక్టర్​కు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి కాంట్రాక్టర్​ ఎక్స్​కవేటర్లను, టిప్పర్లను తీసుకొచ్చాడు. వాగులో రోడ్డు కూడా వేశాడు. 

ఎండిపోతున్న ఫిల్టర్​ పాయింట్​బోర్లు

ఈ రెండు చెక్​డ్యామ్​లో పరిధిలో దాదాపు 70 ఫిల్టర్​ ఫాయింట్​ బోర్లు (చేతి బోర్లు) ఉన్నాయి. పది నుంచి 20 ఫీట్లలోపు ఈ బోర్లలో నీళ్లు ఉన్నాయి. ఒక్కో ఫిల్టర్​ పాయింట్ బోరు కింద ఆరు ఎకరాలు సాగవుతుండగా,70 బోర్ల కింద 420 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వీటి పరిధిలోని రైతులు ఈ యాసంగిలో వరే వేశారు.  ప్రస్తుతం పంట చివరి దశలో ఉంది. ఈ టైంలో టీఎస్​ఎండీసీ ఇసుక పూడికతీతకు అనుమతులు ఇవ్వడంపై ఈ వాగు ప్రాంత రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఇసుకను తవ్వితే గ్రౌండ్​ వాటర్​ అడుగంటుతుందని చెబుతున్నారు.  ఫిల్టర్​ పాయింట్​ బోర్లపై దీని ప్రభావంగా ఎక్కువగా ఉంటుందని, ఇసుకను తవ్వితే ఈ బోర్లు ఎండిపోయి మా పంటలు ఎండిపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎంజీకేఎల్​ఐ కాల్వ కింద వేల ఎకరాల్లో వరి ఎండిపోయినా పట్టించుకోవడం లేదని, ఇసుకను తవ్వితే ఆగమవుతామని వాపోతున్నారు. 

ప్రజాభిప్రాయం లేకుండా పర్మిషన్​ ఎట్లిస్తరు?

వాగులో ఇసుక తవ్వకాల కోసం ఇచ్చిన పర్మిషన్​ను రద్దు చేయాలని ఈనెల 21న అయ్యవారిపల్లి, వెలుగోముల, చిల్వేర్​​ గ్రామాల రైతులు ఎన్​హెచ్​-167పై రాస్తారోకో చేశారు. వీరికి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లతో పాటు అధికార పార్టీకి చెందిన లీడర్లు కూడా మద్దతు తెలిపారు.  ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇసుక తవ్వకాలకు ఎట్లా అనుమతులు ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్​, ఎమ్మెల్యేలను కోరినా ఇంత వరకు స్పందించడం లేదని చెబుతున్నారు. రెండు రోజుల్లో కోర్టుకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. 

 సమాచారం ఇస్తలేరు

రెండు నెలల కిందట ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎంజీకేఎల్‌‌‌‌‌‌‌‌ఐ కాల్వకు నీళ్లు బంద్​ పెట్టి మమ్మల్ని ఆగంజేసిన్రు.  ఇప్పుడు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాగులో ఇసుక తవ్వడానికే పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన్రు.  వాగే ఆధారంగా యాసంగి పంటలేసుకున్నం   ఇసుకను తోడుకుపోతే గ్రౌండ్​ వాటర్​తగ్గి పంటలు ఎండిపోతే మా పరిస్థితి ఏంటి?  
- హుస్సేన్​, రైతు, చిల్వేర్​, మిడ్జిల్​ మండలం

టీఆర్​ఎస్‌‌‌‌కు రాజీనామా చేస్తం

మా ఊళ్లో దుందుభి మీద ఆధారపడి రైతులు 300 ఎకరాల్లో పంటలేసుకున్నరు. ఇప్పుడు వాగులో ఇసుకను తీసేందుకు టీఎస్​ఎండీసీ పర్మిషన్​ ఇవ్వడంతో ఓట్లు వేసి గెలిపించినందుకు బాగా బుద్ధి చెబుతున్నారని  నన్ను తిడుతున్నరు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు కూడా చెప్పిన. మీరే పోయి టిప్పర్లను ఆపండని అంటున్నడు. ఇసుక పర్మిషన్‌‌‌‌ రద్దు చేయకుంటే పార్టీకి రాజీనామా చేసి  ఉద్యమం చేస్త.  
- శ్రీకాంత్, టీఆర్​ఎస్​ సోషల్​ మీడియా ఇన్​చార్జి, అయ్యవారిపల్లి

జాయింట్​ ఇన్​స్పెక్షన్​ చేసేఅనుమతులు

చెక్​డ్యామ్​ కట్టిన తర్వాత అక్కడ వాటర్​ ఆగాలంటే డీ సిల్టేషన్‌‌ చేయాలి. అప్పుడే నీళ్లు స్టోర్​ అవుతాయి. గ్రౌండ్​ వాటర్, ఇరిగేషన్​, మైనింగ్, టీఎస్​ఎండీసీ​ జాయింట్​ ఇన్​స్పెక్షన్​ చేశాం. ఆ రిపోర్ట్​ను కలెక్టర్​కు అందజేశాం. దాని ప్రకారమే అనుమతులు వచ్చాయి. వాగు సమీపంలో ఎలాంటి బోర్లు లేవు. ఫిల్టర్​ పాయింట్​ బోర్లు కూడా లేవు.
- శ్రీనివాస్​, టీఎస్​ఎండీసీ ప్రాజెక్ట్​ డైరెక్టర్​