చంబా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్యాక్సీ లోయలో పడిపోవడంతో స్థానిక డ్రైవర్‌తో పాటు బెంగళూరుకు చెందిన ఏడుగురు టూరిస్టులు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బైరాగఢ్- సాచ్ పాస్- కిల్లార్ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మొబైల్ కనెక్టివిటీ లేకపోవడం, మారుమూల ప్రాంతం కావడంతో ప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా శనివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది.
వాహనంలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, ప్రమాదంలో వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. వాహనం దాదాపు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో సహాయక చర్యలు చాలా కష్టంగా మారాయి. నిటారైన భూభాగం, ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాద స్థలానికి చేరుకోవడానికి, బాధితులను వెలికితీయడానికి ప్రయత్నాలు సంక్లిష్టంగా మారాయని పోలీసులు తెలిపారు.
కాగా, ట్యాక్సీ అనుకున్న సమయానికి డల్హౌసీకి తిరిగి రాకపోవడం, డ్రైవర్ నుంచి సమాచారం లేకపోవడంతో వెహికల్ ఓనర్ అనుమానంతో ట్యాక్సీ జీపీఎస్ లొకేషన్ చెక్ చేశాడు. కలవాన్ ప్రాంతం సమీపంలో ట్యాక్సీ కదలకుండా ఉన్నట్లు చూపించింది. దీంతో ఆయన స్థానికులు, పోలీసులతో కలిసి లొకేషన్‌కు వెళ్లగా యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసింది.
