V6 News

ఎల్లమ్మ తల్లి దర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

ఎల్లమ్మ తల్లి దర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
  • యాక్సిడెంట్​లో తండ్రీకొడుకు మృతి
  • తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలు
  • బైక్​పై వెళ్తుండగా ఢీకొట్టిన వాహనం
  • రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: అమ్మవారి దర్శనానికి బైక్​పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని  రోడ్డు ప్రమాదం చిదిమేసింది. కుటుంబంలో తండ్రీకొడుకు మృతిచెందగా, తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పరిధిలో మంగళవారం జరిగింది. హయత్‌‌‌‌‌‌‌‌నగర్ మండలం సాహెబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి ప్రశాంత్ గౌడ్(41) తన భార్య వాణి, పిల్లలు శ్రీతన్(11), శశికతో కలిసి రావిర్యాలలోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి బైక్‌‌‌‌‌‌‌‌పై బయలుదేరారు. వండర్‌‌‌‌‌‌‌‌లా జంక్షన్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రశాంత్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కొడుకు శ్రీతన్ ను హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. భార్య వాణి, కుమార్తె శశిక యశోద హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.