
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భయంకర ఘటన చోటు చేసుకుంది. తన 14 రోజుల పసి పాపను తండ్రి అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ అమానవీయ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గోల్కొండ పరిధి గుల్షన్ కాలనీలో భార్య గౌరీ, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అక్కడే వాచ్ మెన్‌గా విధులు నిర్వహిస్తు్న్నాడు.
ఈ క్రమంలో గురువారం (మే 15) భార్య గౌరీతో జగత్ గొడవపడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన జగత్.. భార్య నిద్రిస్తున్న సమయంలో అత్యంత అమానవీయంగా తన 14 రోజుల పసి పాపను గొంతు కోసి హత్య చేశాడు. నిద్రలేచి చూసిన భార్య రక్తపు మడుగులో ఉన్న పసిపాపను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మర్డర్ కేసు నమోదు చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే 14 రోజుల పసి కందును అత్యంత కిరాతంగా గొంతు కోసి హత్య చేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.