- ఏరియా కమిటీ సభ్యురాలు రూపిగా గుర్తింపు
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీకి చెందిన మహిళా కమాండర్ రంగబోయిన భాగ్య అలియాస్ రూపి మృతి చెందారు. కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా తెలిపిన వివరాల ప్రకారం... చోటే బేటీయా, -పర్తాపూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని మాచ్‌పల్లి, అరంజోరా, హిడూర్ అడవుల్లో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు తెలియడంతో భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి.
ఈ క్రమంలో మాచ్‌పల్లి అడవుల్లో బలగాలను గమనించిన మావోయిస్ట్‌లు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. ఈ క్రమంలో భద్రతాబలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. కాల్పులు ఆగిపోయిన తర్వాత ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. మహిళా మావోయిస్ట్ డెడ్‌బాడీ కనిపించింది. చనిపోయిన మావోయిస్ట్ ఏరియా కమిటీ సభ్యురాలు, కమాండర్ రంగబోయిన భాగ్య అలియాస్ రూపిగా గుర్తించారు.
ఈమెపై రూ.4 లక్షల రివార్డు ఉంది. రూపిరెడ్డి భర్త విజయ్‌రెడ్డి సైతం గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు కాంకేర్ఎస్పీ నిఖిల్రాఖేచ తెలిపారు. ఘటనాస్థలం నుంచి పిస్టల్, తూటాలు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు, విప్లవసాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
ధర్మారంలో విషాదఛాయలు
సిద్దిపేట, వెలుగు : చత్తీస్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కమాండర రూపి అలియాస్ రంగబోయిన భాగ్య చనిపోవడంతో ఆమె స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భాగ్య 2004లో 15 ఏండ్ల వయస్సులోనే మావోయిస్ట్ పార్టీలో చేరింది. భాగ్య మృతి విషయం తెలిసిన ఆమె తల్లి లక్ష్మి, సోదరి కన్నీటిపర్యంతమయ్యారు. భాగ్య తండ్రి నర్సయ్య తొమ్మిదేండ్ల కిందే చనిపోయారు.

