ఫిడే విమెన్స్‌‌ వరల్డ్ కప్‌‌.. రెండో గేమ్‌‌లో దివ్య ఓటమి

 ఫిడే విమెన్స్‌‌ వరల్డ్ కప్‌‌.. రెండో గేమ్‌‌లో దివ్య ఓటమి


బటెమి (జార్జియా):  ఫిడే విమెన్స్‌‌ వరల్డ్ కప్‌‌లో సంచలన విజయం సాధించిన ఇండియా యంగ్‌‌స్టర్ దివ్య దేశ్‌‌ముఖ్ ప్రిక్వార్టర్స్‌‌ రెండో గేమ్‌‌లో నిరాశపర్చింది.  గురువారం జరిగిన ఈ  గేమ్‌‌లో వరల్డ్‌‌ రెండో ర్యాంకర్‌‌, చైనా స్టార్‌‌ జూ జినెర్‌‌ 57 ఎత్తులతో దివ్యను ఓడించి తొలి గేమ్‌‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. నల్ల పావులతో ఆడిన దివ్య ఆరంభంలో మెరుగ్గా కనిపించినా.. గేమ్‌‌ మధ్యలో వ్యూహాత్మకంగా ఆడలేకపోయింది. జినెర్‌‌ ఎత్తులను తప్పించుకునే క్రమంలో పావులను కోల్పోయింది. ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ కోనేరు హంపి.. అలెగ్జాండ్రా కోస్టెనియక్‌‌తో జరిగిన గేమ్‌‌ను 73 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. మరో గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల వద్ద రష్యా ప్లేయర్‌‌ కాటెరినా లాగ్నోతో జరిగిన గేమ్‌‌ను డ్రాగా ముగించింది. ఆర్‌‌. వైశాలి.. మెరుయెర్ట్‌‌ కమలిడెనోవా (కజకిస్తాన్‌‌) మధ్య జరిగిన గేమ్‌‌ కూడా 70 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ రౌండ్‌‌ తర్వాత ఇండియా ప్లేయర్ల ఖాతాలో ఒక్కో పాయింట్‌‌ ఉంది. శుక్రవారం టైబ్రేక్‌‌ మ్యాచ్‌‌లు జరుగుతాయి.