
సినిమాలు, సీరియళ్ల ప్రభావమో.. లేదంటే పాశ్చాత్య సంస్కతి విజృంభిస్తుందో కానీ, విద్యార్థులు మాత్రం దారి తప్పుతున్నారు. కాలేజీకి వెళ్లి చదువుకోవడం మానేసి ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. ప్రేమ, దోమ అంటూ జంటగా కలిసి మాల్స్, పార్కుల వెంబడి తిరుగుతున్నారు. పోనీ, ఆ పంచే ప్రేమైనా ఒకరి మీద ఉండి చావట్లేదు. గుండెలో నాలుగు గదులు ఉన్నట్లు, తమ హృదయంలో నలుగురికి చోటిస్తున్నారు. అది కాస్తా బయటపడిన రోజు గొడవలకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే ఇది.
'వాడు నా వాడు.. కాదు, నాకే సొంతం, మేమిద్దరం మనసారా ప్రేమించుకుంటున్నాం..' అంటూ ఇద్దరు అమ్మాయిలు తరగది గదిలోనే బాహాబాహీకి దిగారు. తోటి విద్యార్థుల ముందే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఇందులో, ఒకమ్మాయి తనపై నాలుగు దెబ్బలు ఎక్కువ పడేసరికి తోటి విధ్యార్థులనే ఉసిగొల్పి గొడవలోకి దించింది. దాంతో, అందరూ కలిసి మరో విద్యార్థినిని చావబాదారు. ఈ విషయం తెలిసి సానుభూతితో మరో వర్గం సైతం గొడవలోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో, తరగది గది, క్యాంపస్ పరిసరాలు రణరంగంగా మారాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అసలేంటి ఈ గొడవ..?
నోయిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (NIET)కి చెందిన ఒక మగజాతి ఆణిముత్యం ఒకే క్లాస్‌లో ఇద్దరు అమ్మాయిలను ప్రేమలోకి దించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. ఈ విషయం కాస్తా బయటపడటంతో తరగతి గదిలోనే ఇద్దరు విద్యార్థినులు(ప్రియురాళ్లు) గొడవకు దిగారు. 'వాడు నాకు కావాలంటే, నాకే సొంతమంటూ..' జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ గొడవలోకి వారి మద్దతుదారులు సైతం ఎంట్రీ ఇవ్వడంతో అరుపులు, ఏడుపులతో క్యాంపస్ దద్ధరిల్లింది.
#Noida- Students Engage in Massive Brawl During Class at NIET Institute; Video Goes Viral@Uppolice @noidapolice #NIET #ViralVideos #Trending pic.twitter.com/bHhSlsah3m
— The Vocal News (@thevocalnews) August 6, 2024
ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది రంగప్రవేశం చేసి గొడవను విరమింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శాంతిభద్రతలను పరిశీలించారు.
మేనేజ్మెంట్ సీరియస్
ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఐఈటీ యాజమాన్యం ప్రకటించింది. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టేందుకు విచారణ ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కాలేజీ మేనేజ్మెంట్ హామీ ఇచ్చింది.