బీసీలకు లక్ష ఆర్థికసాయం నియోజకవర్గంలో 300 మందికి : మంత్రి గంగుల

బీసీలకు లక్ష ఆర్థికసాయం నియోజకవర్గంలో 300 మందికి : మంత్రి గంగుల
  • ఇది నిరంతర ప్రక్రియ: గంగుల 
  • ప్రతి నెలా 15న చెక్కుల పంపిణీ

కరీంనగర్, వెలుగు: ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తులవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 15న ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులు అందించేం దుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వర్చువల్​గా రివ్యూ చేశారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కులవృత్తిదారులను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల తోడ్పాటు అందిస్తున్నదన్నారు. 

తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా వారి వృత్తికి సంబంధించిన పనిముట్లు, ముడిపదార్థాలు కొనుక్కునేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందన్నారు. ప్రతినెలా 15న లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత నెల చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం 5,28,000 అప్లికేషన్లు వచ్చాయని, వాటిని చాలా స్పీడ్ గా వెరిఫై చేస్తున్నట్లు తెలిపారు.