హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లలో ఒకటైన సికింద్రాబాద్ 'ది మనోహర్' హోటల్ చైర్మన్ డి.వి. మనోహర్‌పై బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే హోటల్‌లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై ఆయన లైంగిక దాడికి, హత్యాచారానికి యత్నించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు గత కొంతకాలంగా బేగంపేట పరిధిలోని 'ది మనోహర్' హోటల్‌లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో హోటల్ చైర్మన్ డి.వి. మనోహర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, హత్యాచారానికి యత్నించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా బేగంపేట పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు. డి.వి. మనోహర్‌పై BNS సెక్షన్లు 74, 78, 79, 351(2), 352 r/w 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
