ఫుట్‌బాల్ మ్యాచ్ అనుకుంటే.. ఫైర్‌వర్క్స్ షో అయిపోయిందిగా.. జర్మన్ కప్‌లో ఫ్యాన్స్ రచ్చ!

ఫుట్‌బాల్ మ్యాచ్ అనుకుంటే.. ఫైర్‌వర్క్స్ షో అయిపోయిందిగా.. జర్మన్ కప్‌లో ఫ్యాన్స్ రచ్చ!

German Cup Chaos: జర్మన్ కప్‌లో ఊహించని హైడ్రామా చోటు చేసుకుంది. వాల్డోఫ్ మాన్‌హైమ్, కైసర్‌స్లాటర్న్ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చి అల్లకల్లోలం సృష్టించారు. స్టేడియం నలుమూలల నుంచి ఫైర్‌వర్క్స్, పటాకులు, వస్తువులను ఆటగాళ్లపైకి విసరడంతో ఈ మ్యాచ్ సుమారు అరగంటకు పైగా నిలిచిపోయింది. 

ఆటగాళ్లపైకి ఫైర్‌వర్క్స్ దాడి: 

నిర్ణీత సమయం ముగిసేసరికి మ్యాచ్ 0–0తో సమంగా ఉండి, ఎక్స్‌ట్రా టైమ్‌కి వెళ్తున్న సమయంలో ఈ విధ్వంసం జరిగింది. ఇరు జట్ల అభిమానులు ఒక్కసారిగా ఫ్లేర్లు, పటాకులు ప్లేయర్లపైకి విసరడంతో ఆటగాళ్లు ప్రాణభయంతో గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు ఫ్యాన్స్ ఏకంగా పిచ్‌ మధ్యలోకి దూసుకొచ్చారు. దీంతో ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించిన రైట్ పోలీసులు, గుర్రపు స్వారీ దళాలు (Mounted Police) మైదానంలోకి దిగి గొడవ చేస్తున్న అభిమానులను వెనక్కి నెట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

లాస్ట్ మినిట్ గోల్‌తో ఊహించని విజయం: 

పోలీసులు భద్రతా హామీ ఇవ్వడంతో దాదాపు 30 నిమిషాల నిరీక్షణ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఇక మ్యాచ్ టై అవుతుందనుకున్న సమయంలో, ఎక్స్‌ట్రా టైమ్ ఆఖరి నిమిషంలో ఇబ్రహీమ్ కనాటే సంచలన గోల్ కొట్టాడు. దీంతో సెకండ్ డివిజన్ జట్టు అయిన కైసర్‌స్లాటర్న్ 1–0 తేడాతో ఘన విజయం సాధించి జర్మన్ కప్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది.