ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో భారీ‌ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. మంగళవారం సాయంత్రం అక్కడ మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అయితే షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది.

మంటలను అదుపుచేయడానికి 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్‌కు చెందినవారు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్టు మంగళవారం ఉదయం ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. అయితే… షూటింగ్‌ మొదలైన మొదటి రోజే ‘ఆదిపురుష్’ సెట్స్‌లో అగ్నిప్రమాదం జరగడంపై ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.