ఇవాళ ( ఏప్రిల్ 4 ) ఇబ్రహీంపట్నం ఎన్నిక..కిడ్నాప్ డ్రామాలు, కోర్టు ఆదేశాల మధ్య ఇన్నాళ్లు వాయిదా

ఇవాళ ( ఏప్రిల్ 4 ) ఇబ్రహీంపట్నం ఎన్నిక..కిడ్నాప్ డ్రామాలు, కోర్టు ఆదేశాల మధ్య ఇన్నాళ్లు వాయిదా
  • చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

ఇబ్రహీంపట్నం, వెలుగు: అనేక వివాదాలు, హైకోర్టు ఆదేశాల మధ్య వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్- 13, కాంగ్రెస్ -8, బీజేపీ- 2, ఇండిపెండెంట్- 1 స్థానాలు గెలుచుకోగా, క్యాంపు రాజకీయాల నడుమ 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి, ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణ అదృశ్యమయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. 

గతంలో అధికారులు ఎన్నికకు ప్రయత్నించినప్పుడు యాదగిరి మినహా మిగిలిన 23 మంది హాజరైనప్పటికీ గందరగోళ పరిస్థితుల వల్ల వాయిదా పడింది. అనంతరం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కాగా, తనను బీఆర్ఎస్ నేతలు బలవంతంగా నిర్బంధించారని యాదగిరి తెలపడంతో, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఏప్రిల్ 4న ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోగా, కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికల అబ్జర్వర్​గా నారాయణ్ అమిత్ మాలెపాటి, ప్రిసైడింగ్ అధికారిగా జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.