గండిపేట, వెలుగు: పంట మార్పిడి ప్రాముఖ్యతపై అగ్రి వర్సిటీలో శనివారం రైతు సంఘాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో విస్తృత స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.
కేవలం అధిక దిగుబడే కాకుండా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి లక్ష్యంగా వ్యవసాయ రంగం ముందుకు సాగాలని, అందుకోసం రసాయనాల వాడకాన్ని తగ్గించి పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో రైతులు, నిపుణులు ఇచ్చే సూచనలను క్రోడీకరించి, పంట మార్పిడి ప్రోత్సాహానికి అవసరమైన విధివిధానాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు.
