జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రియురాలు తన ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో, ఆమెతో మాట్లాడించాలంటూ ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు శుక్రవారం మోరంచపల్లి సమీపంలోని విద్యుత్ టవర్ ఎక్కాడు.
తన ప్రేయసి ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని, ఆమె మాట్లాడితేనే దిగుతానని మొండికేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా గణపురం సీఐ కర్ణాకర్ రావు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. ఈ ఘటనతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.
