- సోఫా, టీవీతోపాటు గృహోపకరణాలు దగ్ధం
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ వసంతనగర్ కాలనీలోని ఓ ఇంట్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ప్లాట్ నంబర్ 674లో ఏసీ వద్ద ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఇల్లంతా వ్యాపించి సోఫా, టీవీ తదితర గృహోపకరణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్బీనగర్: మన్సూరాబాద్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలోనూ ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి, గృహోపకరణాలన్నీ కాలిపోయాయి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని, గతంలోనే విద్యుత్ సమస్యలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులతోటు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
