శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సల్స్ రచ్చ

శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సల్స్ రచ్చ
  • పలువురు స్టూడెంట్లపై నక్సలైట్లుగా నెపం
  • తనను టార్గెట్​ చేస్తున్నారంటూ ప్రొఫెసర్ సుజాత ఆరోపణ 
  • వీసీపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌కు ఫిర్యాదు 
  • ప్రశ్నించే వారిపై ముద్ర వేస్తున్నారంటున్న లెఫ్ట్ విద్యార్థి సంఘాలు

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో ‘అర్బన్ నక్సల్స్’ పేరిట కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు చేయడం వివాదాస్పదంగా మారింది. శాతవాహన యూనివర్సిటీ పరిరక్షణ సమితి పేరిట కొందరు కలెక్టర్, యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌‌కు దరఖాస్తులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు కనుమరుగైన నేపథ్యంలో యూనివర్సిటీలో అర్బన్ నక్సల్స్ ఉన్నారంటూ ప్రచారం చేయడం వివాదానికి దారితీసింది. అర్బన్ నక్సల్స్ పేరిట యూనివర్సిటీలో దళితులను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ విద్యా కమిషన్ సభ్యురాలు, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. 

వీసీకి గతంలోనే సుజాతతో విభేదాలు..

ప్రస్తుత వీసీ ఉమేశ్​కుమార్ గతంలో శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌గా పనిచేశారు. ఆ సమయంలోనే యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో ఆయనకు విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఉమేశ్​కుమార్ రిజిస్ట్రార్ పదవి నుంచి వైదొలగాల్సి రావడానికి సుజాతనే కారణమనే ప్రచారం కూడా ఉంది. తర్వాత వీసీగా తిరిగి శాతవాహన యూనివర్సిటీకి వచ్చిన ఉమేశ్​కుమార్ ఏడాది పాటు ఎలాంటి వివాదాల్లేకుండా పాలన సాగించారు. అయితే రెండో కాన్వొకేషన్ తర్వాత ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను డీన్, ప్రిన్సిపాల్ పదవుల నుంచి తొలగించడంతో వివాదం మళ్లీ ముదిరినట్లు అయ్యింది.

నాలుగేళ్ల క్రితం 12బీ విషయంలో యూజీసీకి ఫిర్యాదు చేశారనే ఆరోపణలతో తొలగించిన డాక్టర్ పెంచాల శ్రీనివాస్, డాక్టర్ చక్రధర్‌‌లను తిరిగి పార్ట్‌‌టైమ్ లెక్చరర్లుగా నియమించడం కూడా వివాదానికి కారణమైంది. శాతవాహన యూనివర్సిటీకి 12బీ విషయంలో తమకు ఎలాంటి లేఖ అందలేదని యూజీసీ ఆర్టీఐ కింద తెలిపిందని, తమను అన్యాయంగా తొలగించారని పెంచాల శ్రీనివాస్ గత కొంతకాలంగా ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన జాతీయ బీసీ కమిషన్‌‌ను ఆశ్రయించగా, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈసీ ఆమోదంతోనే పెంచాల శ్రీనివాస్‌‌ను లెక్చరర్‌‌గా తిరిగి విధుల్లోకి తీసుకున్నామని వీసీ ఉమేశ్​ కుమార్ తెలిపారు. అయితే గతంలో కేసులు ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఉద్యోగంలోకి తీసుకున్నారని సూరేపల్లి సుజాత ఆరోపిస్తున్నారు.

ముదురుతున్న వివాదం..

ఇటీవల యూనివర్సిటీలో పీహెచ్‌‌డీ అడ్మిషన్ పొందిన కొందరు పరిశోధక విద్యార్థులు అర్బన్ నక్సల్ పేరుతో వీసీ, రిజిస్ట్రార్‌‌తో పాటు కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేయడం వివాదాస్పదమైంది. ఆ ఫిర్యాదులో సోషియాలజీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎకనామిక్స్ పీజీ విద్యార్థి కరికె మహేశ్​ పేర్లు ప్రస్తావించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఫిర్యాదులను వీసీ ఉమేశ్​ కుమార్ ప్రోత్సహిస్తున్నారని సూరేపల్లి సుజాత ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపక వర్గాల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు యూనివర్సిటీలో ప్రశ్నించే వారిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేయడం సరికాదని, అక్కడ జరుగుతున్న అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, రజనీకాంత్ హెచ్చరించారు.

పదవులు పోయినందుకే ఆరోపణలు

ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను రొటేషన్ లో భాగంగా పదవుల నుంచి తొలగించాల్సి వచ్చింది. ప్రిన్సిపాల్ గా దివ్యాంగురాలు, దళితురాలైన ప్రొఫెసర్ పద్మావతిని నియమించాం. అందుకే సుజాత అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అర్బన్ నక్సల్స్ పేరిట ఫిర్యాదులు ఇచ్చిన వాళ్లను వదిలేసి ఎలాంటి  సంబంధం లేని నాపై ఆరోపణలు చేయడం సబబు కాదు.- ప్రొఫెసర్ ఉమేశ్​కుమార్, వీసీ, శాతవాహన వర్సిటీ 

కరీంనగర్​లో అర్బన్‌‌ నక్సల్స్‌‌ లేరు

కరీంనగర్‌‌లో అర్బన్‌‌ నక్సల్స్‌‌ ఉన్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాంటిదేమైనా ఉంటే నిఘా వర్గాలు మాకు సమాచారమిస్తాయి. ఈ విషయంలో శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిషనరేట్‌‌ పరిధిలో అర్బన్‌‌ నక్సలైట్లు ఎవరూ లేరు. గౌష్ ఆలం, పోలీస్‌‌ కమిషనర్‌‌, కరీంనగర్​