ఎవరూ లేవనెత్తని సమస్యలను లేవనెత్తడంతోనే రాఘవ్ చద్దా ప్రజల దృష్టిలో రాబిన్‌హుడ్‌లా కనిపించడం మొదలైంది. అందుకే కొంతకాలంగా రాఘవ్ చద్దా పేరు క్రేజీ నేమ్‌గా మారుతూ వచ్చింది. మొన్నటి నుంచి ఆ పేరు సోషల్ మీడియాలో మరింత ఫుల్ ట్రెండింగ్‌లో నడుస్తున్నది. ఆ పేరు ఇంతగా చర్చలోకి రావడానికి కారణం.. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించడం, పార్టీ తరఫున మాట్లాడటానికి అతనికి అవకాశం ఇవ్వవద్దని రాజ్యసభ సెక్రటేరియెట్‌కు ఆప్ పార్టీ లేఖ రాయడమే.
సహజంగా ప్రజల్లో కొన్ని విషయాల్లో ఉండే అనుమానాలు, అసహనాలనే రాఘవ్ చద్దా తన ఆయుధాలుగా మార్చుకొని రాజ్యసభలో కొంతకాలంగా ప్రశ్నలు కురిపిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రశ్నలకు కొన్నైనా పరిష్కారాలు కూడా దొరుకుతుండడంతో ఆయన పట్ల ప్రజల్లో గౌరవం పెరిగిన మాట వాస్తవం! రాజకీయాల్లో ఎప్పుడైనాగానీ కొత్తదనమే గొప్ప ఆకర్షణ. మొబైల్ ఫోన్ రీచార్జ్‌ను ఒక ఏడాది పేరిట ఒక నెల చార్జీలను అదనంగా కొట్టేస్తున్న మొబైల్ కంపెనీలను రాఘవ్ చద్దా బయటపెట్టేవరకు.. సామాన్యులు కూడా ఆ ధ్యాసలో లేరనే చెప్పాలి. ఆ విషయాన్ని పార్లమెంటులో ప్రశ్నించి మొబైల్ ఫోన్ల కంపెనీలు చేస్తున్న దొంగతనం బయటపెట్టిన చద్దా.. నిజంగా మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి ఒక రాబిన్ హుడ్‌గా కనిపించాడు!
ఎయిర్‌పోర్టులో చాయ్ రూ. 250కి ఎలా అమ్ముతారు? అని ప్రశ్నించిన ఆయన ప్రశ్నకు ప్రభుత్వం దిగిరావడం, ఎయిర్ పోర్టుల్లో ‘ఉడాన్ యాత్రి కేఫె’లు పెట్టడం, ఇపుడు చాలా తక్కువ ధరకే చాయ్ అమ్మడం గమనార్హం. గిగ్ వర్కర్స్ కోసం, బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించడంపై గళ్లమెత్తడం, పనిచేయని ప్రజాప్రతినిధులను రీకాల్ చేయాలనే డిమాండ్ తేవడం.. వంటివి మరెన్నో ఆయన పట్ల ప్రజల్లో ఒక రకమైనా క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఆయన లేవనెత్తిన అంశాలను ఏ పార్టీ ఎప్పుడూ లేవనెత్తిన సందర్భాలు లేవు కాబట్టే రాఘవ్ చద్దా న్యూట్రెండ్ లీడర్‌గా పబ్లిక్ ఎక్స్పోజ్లోకి రాగలిగాడు.
- జెన్జీ లైన్లో..
ఆయన లేవనెత్తిన అంశాలన్నీ దాదాపు న్యూ జనరేషన్ (జెన్ జీ)ని బాగా ఆకర్షించేవే కావడం గమనార్హం. ఆయన రాజకీయ లక్ష్యం కూడా జెన్ జీని ఆకట్టుకోవడమే కావచ్చు. నాయకుడు తన పాపులారిటీ కోసమే చేసినా ప్రజలు చూసేది అందులో ప్రజాప్రయోజనం ఉందా లేదా అని మాత్రమే. ఆయన ప్రశ్నల్లో ప్రజల ప్రయోజనం ఉండడమే ఆయనను ఇంతతొందరగా అంత పాపులర్ చేయగలిగింది! నిజానికి రాఘవ్ చద్దా తన పార్టీ (ఆమ్ ఆద్మీ పార్టీ) లైన్ కన్నా, తనదైన లైన్లో మాట్లాడటం, తన పార్టీ ఎక్స్పోజర్ కన్నా, తన ఎక్స్పోజర్కే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాడని అనిపించడం సహజం. కొంతకాలంగా తమ పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన అటెండ్ కావడం లేదని, కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా కానీ, విడుదల సందర్భంగా కానీ, రాఘవ్ చద్దా స్పందన లేదని ఆప్ అంటోంది. కానీ పార్టీ కమిట్మెంట్ కన్నా ఆయన ప్రజల కమిట్మెంట్కే ప్రశంసలు లభిస్తున్న మాట నిజం.
- పోటీగా ఎదగడాన్ని పార్టీ ఓనర్లు సహించలేరు!
ఒకపార్టీలో ఉంటూ, వ్యక్తిగతంగా ఎదగడాన్ని ఏ పార్టీ ఓనరు సహించడు మరి! పెరుగుతున్న రాఘవ్ చద్దా పాపులారిటీని కేజ్రీవాల్ ఎలా సహించగలడని సైక్రియాట్రిస్టుల వాదన! అన్ని రాజకీయ పార్టీల ఓనర్లకు ఉండే లక్షణమే అది! కేజ్రీవాల్లో ఆ గుణం లేదని ఎలా అనుకోగలం? కేజ్రీవాల్ సైతం అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఎదిగొచ్చిన నాయకుడే. అయినా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినపుడు తనతో నడిచిన అనేకమంది నాయకులను కేజ్రీవాల్ ఇంటికి పంపించేశాడు.
ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్ లాంటి వారెందరో కేజ్రీవాల్ నుంచి దూరమయినవారే. ఇపుడు రాఘవ్ చద్దా తనదైన మార్గంలో నడుస్తున్నపుడు కేజ్రీవాల్ ఎలా భరించగలడు? మర్రి చెట్టు కింద గరక మొలవదు అనేది ఒక సామెత! ఆయా పార్టీల ఓనర్లను మించి పాపులర్ కావాలనుకుంటే కుదిరే పనికాదు మరి! రాఘవ్ చద్దాపై నేపాల్ జెన్జీ మూవ్మెంట్ ప్రభావం బాగా ఉండే ఉంటది! యంగ్ జనరేషన్ ఆలోచనలనే ఆయన ప్రశ్నలుగా మార్చుకున్నట్లు కనిపిస్తున్నాయి! అర్బన్ మధ్యతరగతి, యంగ్ జనరేషన్ ఆకర్షణకు ఆయన ప్రశ్నల్లోనే ప్రాధాన్యం కనిపిస్తున్నది!
ఆమ్ ఆద్మీ పార్టీకి తానే ఒక బాలేన్ షాగా భావిస్తున్న కేజ్రీవాల్.. చద్దాంలాంటి బాలేన్ షాలను పార్టీలో ఎందుకు భరిస్తాడు? ఇది అన్ని పార్టీల్లో ఉండే లాజిక్కే! రాఘవ్ చద్దా ఆప్ పార్టీకి దూరంగా మెదులుతూ, తనకు తాను ఎదిగే ప్రయత్నం చేయడం వెనకాల మరే పార్టీ అయినా ఉందా అనే అనుమానాలు కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేయడం అప్పుడే మొదలుపెట్టారు. అది నిజమో, కాదో తెలియదు కానీ.. చద్దా జెన్జీ ఉద్యమ రాజకీయం వైపు అడుగులేసే ప్రయత్నంగానే.. ఆయన తన పార్టీ(ఆప్)ని కాదని, ప్రజల ప్రశ్నలతో హైలైట్ అయ్యాడని చెప్పవచ్చు! నిజంగా రాఘవ్చద్దా జన్‌జీ లైన్లోనే కొనసాగుతాడా, లేదా మరే పార్టీలోనైనా చేరతాడా అనేదే ప్రస్తుత పొలిటికల్ మార్కెట్‌ను హీటెక్కిస్తున్న అంశం!
- కల్లూరి
Note:ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
