చండూరులో కాంగ్రెస్ ఆఫీసు దగ్ధం

చండూరులో కాంగ్రెస్ ఆఫీసు దగ్ధం

చండూరు, వెలుగు : చండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. మంగళవారం చండూరు మండలంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన ఉండగా, తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కార్యాలయం తగలబడడంతో ఇది కచ్చితంగా ప్రత్యర్ధుల పనేనని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, డీసీసీ అధ్యక్షడు శంకర్ నాయక్ ఆరోపించారు. కార్యాలయం లోపల అగ్గిపుల్లలు పడి ఉండడాన్ని బట్టి దీని వెనక రాజకీయ కుట్ర దాగివుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటల వల్ల గది లోపల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రచారంలో భాగంగా ఇటీవల పోస్టర్లు, బ్యాడ్జీలు, జెండాలు రూ.5లక్షలు పెట్టి కొన్నామని పార్టీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ తెలిపారు. ఘటనను నిరసిస్తూ పాల్వాయి స్రవంతితో పాటు శంకర్​ నాయక్​ చండూరు చౌరస్తాలో ధర్నా చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ల కుట్రే
బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కుట్రతోనే చండూరులోని కాంగ్రెస్‌ ఆఫీసులో సామగ్రి దగ్ధం చేశాయని ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఆరోపించా రు. మంగళవారం కార్యాలయంలో దగ్ధమైన సామగ్రి, గదిని పరిశీలించారు. వారు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పర్యటన చండూరు మండలంలో ఉందని తెలిసి అడ్డుకునేందుకు ఈ పని చేశారని ఆరోపించారు.