ఆరుగాలం కష్టపడిన రైతుకు పంట చేతికి వచ్చినట్లే వచ్చినా ఏదో ఒకరూపంలో చివరికి నష్టాలు తప్పడం లేదు. దిగుబడి సరిగ్గా రాకపోవడంతో నష్టం, వర్షాలు పడి పంట దెబ్బతినటంతో నష్టం.. ఇలా ఏదో ఒకరూపంలో రైతుకు నిరాశ తప్పడం లేదు. కొన్నిసార్లు మానవ తప్పిదంతో కూడా రైతులు నష్టపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు.. చేతికొచ్చిన ధాన్యపు రాసులను భుగ్గిపాలు చేసింది. ధాన్యం కుప్పలు అంటుకుని 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
ఓదెల మండలం ఇందుర్తి లో 2026 మే 21న జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్రంగా ముంచేసింది. కొందరు రైతులు వరి కొయ్యలు అంటిబెట్టడంతో నిప్పు రవ్వలు గాలికి ఎగసిపడి ధాన్యం కుప్పలకు మంటలు అంటుకున్నాయి. పంట చేనులో ఆరబోసిన సీడ్ వడ్ల సంచులకు, కుప్పలకు మంటలు అంటుకున్నాయి.
అప్రమత్తమైన రైతులు ట్రాక్టర్ తో వాటర్ తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నలుగురు రైతులకు చెందిన 60 బస్తాల ధాన్యం పూర్తిగా కాలిపోవడం తో 20 లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
