గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని ప్రముఖ మైఫిల్ హోటల్ పైభాగంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు టవర్ మొత్తం వ్యాపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మంటలు చెలరేగడమే కాకుండా టవర్ వద్ద నుంచి భారీ శబ్దాలు వినిపించడంతో హోటల్ కస్టమర్లు, చుట్టుపక్కల వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సెల్ టవర్ నుండి దట్టమైన నల్లటి పొగ ఆకాశమంత ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయింది. ఈ అకస్మాత్తు పరిణామంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్రమాదాన్ని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయా? లేక మరేదైనా సాంకేతిక లోపమా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

