న్యూఢిల్లీ, వెలుగు: తొలి విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్లో అందజేయనున్నారు. ఈ ఏడాది కేంద్రం 131 మందికి అవార్డులను ప్రకటించింది. వీరిలో ఐదుగురు పద్మ విభూషణ్, 13 మంది పద్మ భూషణ్, 113 మంది పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
తెలంగాణ నుంచి గడ్డమనుగు చంద్రమౌళి(సైన్స్), దీపికా రెడ్డి(నృత్యకారిణి), గూడూరు వెంకట్రావు(వైద్యం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్(సైన్స్, ఇంజినీరింగ్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి(వైద్యం), రామారెడ్డి మామిడి(మరణానంతరం–పశుసంవర్ధక, పాడి పరిశ్రమ) ఉన్నారు. వెంకట్రావు, విజయ్ ఆనంద్ రెడ్డి, దీపికా రెడ్డి తొలి విడతలో పురస్కారాలు అందుకోనున్నారు.
వైద్యరంగంలో ఇద్దరు, కళారంగంలో ఒకరు
విజయ్ ఆనంద్‌రెడ్డి క్యాన్సర్ ట్రీట్మెంట్లో దేశంలోనే ఎక్స్ పర్ట్ గా నిలిచారు. రేడియేషన్ అంకాలజీలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేశారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో క్యాన్సర్ విభాగానికి డైరెక్టర్ గా ఉన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీలో వెంకట్రావుకు దాదాపు 30 ఏండ్ల అనుభవం ఉంది.
ల్యాపరోస్కోపిక్ సర్జరీలకు ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందారు. వెంకట్రావు పేరుమీద 200లకు పైగా ఇంటర్నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్‌లు ఉన్నాయి. దీపికా రెడ్డి కూచిపూడి నృత్యంలో 5 దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. రష్యా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, శ్రీలంక తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 2017లో కేంద్ర సంగీత నాటక అవార్డు అందుకున్నారు.
