యాదాద్రి, వెలుగు: నిర్మాణంలో ఉన్న బస్వాపురం రిజర్వాయర్ రెండు గ్రామాల మధ్య చేపల పంచాయితీకి తెర లేపింది. చేపలను పట్టడానికి తమకు హక్కు ఉందంటే కాదు తమకే ఉందంటూ బస్వాపురం, బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తుల మధ్య వాగ్వాదం మొదలై, తోపులాట వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. యాదాద్రి జిల్లాలోని బస్వాపురం రిజర్వాయర్లో అదే గ్రామానికి చెందిన వారు గతంలో చేప పిల్లలు వదిలారు. వీటిని పట్టుకోవడానికి బస్వాపురం మత్స్యకారులు తెప్పలు తీసుకొని వెళ్లి రిజర్వాయర్లో వలలు వేశారు. విషయం తెలుసుకున్న బీఎన్ తిమ్మాపురం మత్స్యకారులు అక్కడికి చేరుకొని, తాము కూడా చేపలు పట్టుకుంటామని వాగ్వాదానికి దిగారు. దీంతో గొడవ కాస్తా.. పెరిగి తోపులాటలకు దారి తీసింది.
దీంతో భువనగిరి రూరల్ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ అక్కడకు చేరుకొని రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మత్స్య శాఖాధికారి రాజారాం రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని కలెక్టర్ పమేలా సత్పతికి వివరించారు. దీంతో రిజర్వాయర్లో ఎవరూ చేపలు పట్టవద్దని కలెక్టర్ఆదేశాలు జారీ చేశారు.

