- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పరిశీలించిన
- మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి
హైదరాబాద్ సిటీ / బేగంబజార్, వెలుగు : మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8న నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సాట్స్చైర్మన్ శివసేనారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ... దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూలైన్ల వద్ద ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరా, కరెంట్ నిరంతరం ఉండేలా చూడాలని ఆదేశించారు. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఈ ఏడాది పంపిణీ కోసం లక్షా 40 వేల కొర్రమీను పిల్లలను సిద్ధం
చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక బస్సులు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆస్తమా రోగుల కోసం హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాంపల్లికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ, జేబీఎస్, నాంపల్లి స్టేషన్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్క్రాస్రోడ్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 44 బస్సులు నడుపుతామని పేర్కొన్నారు.
