హనుమకొండ, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో సహా ఐదుగురిని పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ కమిషనరేట్ ఆఫీస్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ వెల్లడించారు. పరకాల పట్టణానికి చెందిన మడికొండ సుమన్ భరత్ (38)కు అదే ప్రాంతానికి చెందిన లావణ్యతో 2012లో వివాహమైంది. సుమన్ డెలివరీ బాయ్‌గా, మెకానిక్‌గా పని చేస్తుండగా.. లావణ్య మున్సిపల్ కార్మికులిగా పని చేసేది.
లావణ్యకు ఇమ్మడి నరేశ్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారి తీసింది. విషయం సుమన్‌కు తెలియడంతో లావణ్యను తరచూ కొట్టేవాడు. దీంతో వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని నిర్ణయించుకున్న లావణ్య విషయాన్ని తన తమ్ముడు పెండెల రాజుతో పాటు ప్రియుడు నరేశ్‌కు చెప్పింది. నరేశ్, రాజు తమకు పరిచయం ఉన్న ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని సంప్రదించి రూ.5 లక్షల సుపారీ మాట్లాడుకున్నారు.
అనంతరం లావణ్య తన బంగారం కుదువపెట్టి రూ.1.59 లక్షలు, ఇమ్మడి నరేశ్ రూ.2 లక్షలు, పెండెల రాజు రూ. లక్ష.. మొత్తం రూ.4.59 లక్షలను వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. దీంతో అతడు తన స్నేహితులు భూక్యా రాకేశ్‌తో కలిసి సుమన్‌ను చంపేందుకు ప్లాన్ చేశాడు. సుమన్ భరత్‌కు గతంలోనే చిరంశెట్టి వెంకటేశ్వర్లుతో పరిచయం ఉండడంతో ఈ నెల 3న వెంకటేశ్వర్లు, రాకేశ్ ఇద్దరూ కలిసి సుమన్‌ను ములుగుకు పిలిపించారు.
రాత్రి 8 గంటల సమయంలో వెంకటేశ్వర్లు పొలం వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. సుమన్ మత్తులోకి జారుకున్నాక బీర్‌బాటిల్‌తో తలపై కొట్టారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. సుమన్ భరత్ మంటల్లో కాలిపోతుండగా.. రాకేశ్, వెంకటేశ్వర్లు తమ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం వాటిని లావణ్య, రాజుకు చూపించి మిగతా రూ.40 వేలు తీసుకున్నారు. సుమన్ భరత్‌ను చంపిన ఆనవాళ్లు ఎవరికీ దొరకకుండా వెంకటేశ్వర్లు ప్లాన్ చేశాడు.
ఇందులో భాగంగా ఈ నెల 5న రాత్రి సుమన్‌ను కాలబెట్టిన ప్రదేశానికి వెళ్లి ఎముకలన్నింటినీ ఓ సంచిలో వేసి పక్కనే ఉన్న వాగులో పడేశాడు. మరో వైపు తన భర్త కనిపించడం లేదంటూ లావణ్య అతని కుటుంబ సభ్యులకు చెప్పగా.. సుమన్ భరత్ తండ్రి సాంబయ్య ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించిన పోలీసులు చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో వారిద్దరితో పాటు లావణ్య, ఆమె తమ్ముడు పెండెల రాజు, ప్రియుడు ఇమ్మడి నరేశ్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అభినందించారు.

