గ్రేటర్ వరంగల్, వెలుగు: తెలంగాణ ప్రజలను అవమానించేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు.
ఈ వ్యాఖ్యలపై తక్షణమే బీజేపీ మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని, ఇది ఒక కుట్రగా ఇప్పుడు బహిర్గతమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష మానుకుని సమానత్వంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

