న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా ఎంపికైన ఐదుగురు జడ్జీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వారిలో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు (చీఫ్ జస్టిస్‌లు) కాగా, ఒకరు సీనియర్ మహిళా న్యాయవాది ఉన్నారు. పంజాబ్-–హర్యానా హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ షీల్ నాగు, బొంబాయి హైకోర్టు సీజే జస్టిస్ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జమ్మూ కాశ్మీర్- లడఖ్ హైకోర్టు సీజే జస్టిస్ అరుణ్ పల్లి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
వీరితో పాటు సీనియర్ అడ్వకేట్ వెంకిట సుబ్రమణి మోహన నేరుగా బార్ (న్యాయవాదుల కోటా) నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికై రికార్డు సృష్టించారు. జస్టిస్ ఇందు మల్హోత్రా (2018) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళా లాయర్‌గా ఆమె నిలిచారు. ఆగస్టు 2021 తర్వాత ఒక మహిళా జడ్జిని కొలీజియం సిఫార్సు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్ బీవీ నాగరత్నతో పాటు ఆమె రెండో మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. తాజా ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. ప్రస్తుతం ఒకే ఒక్క స్థానం ఖాళీగా ఉంది.
