టైగర్‌‌ కారిడార్‌‌ నుంచి చెంచుల తరలింపు ! ..అడవిని వీడనున్న అమ్రాబాద్‌‌ కోర్ గ్రామాల చెంచులు

టైగర్‌‌ కారిడార్‌‌ నుంచి  చెంచుల తరలింపు ! ..అడవిని వీడనున్న అమ్రాబాద్‌‌ కోర్ గ్రామాల చెంచులు

 

  •  471 కుటుంబాలకు రూ. 15 లక్షల ఆర్థికసాయం 
  • మరో 617 కుటుంబాలకు పునరావాసం
  • బాచారంలో 1,501 హెక్టార్ల భూమి కేటాయింపు

హైదరాబాద్, వెలుగు : బాహ్య ప్రపంచానికి దూరంగా.. కనీస సౌకర్యాలూ లేకున్నా.. దశాబ్దాలుగా అడవిని నమ్ముకొని బతుకున్న వారు ఇప్పుడు తర్వాతి తరం భవిష్యత్‌‌ కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అమ్రాబాద్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు పునరావాసాన్ని అవకాశంగా తీసుకొని అడవిని వీడుతున్నారు. 

ఏటీఆర్‌‌ కోర్ ఏరియాలోని పులులు, వన్యప్రాణుల రక్షణ కోసం ఐదు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా, గ్రామసభల ఆమోదంతో తరలివస్తున్నారని అధికారులు, గ్రామస్తులు చెబుతుండగా.. బలవంతంగా తరలిస్తూ హక్కులను కాలరాస్తున్నారని  ఎన్జీవోలు ఆరోపిస్తున్నాయి. 

అడవిని వదిలి బయటకు వచ్చే కుటుంబాలకు బాచారం సమీపంలో అన్ని సౌలత్‌‌లతో కొత్త గ్రామాలను నిర్మిస్తున్నారు. నల్లమల అడవుల్లోని చెంచులకు అడవి బయట మెరుగైన జీవనోపాధి, విద్య, వైద్యం కల్పించడంతో పాటు కోర్ ఏరియాలో పులుల సంచారాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ చేపడుతున్నామని ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

బాచారంలో 1501.88 హెక్టార్లలో పునరావాసం

అమ్రాబాద్​కోర్‌‌ ఏరియాలోని ఐదు గ్రామాల్లో చెంచులు ఎక్కువగా నివసిస్తున్నారు. అడవి నుంచి బయటకు వచ్చే కుటుంబాల కోసం ప్రభుత్వం రెండు రకాల ప్యాకేజీలను ఆఫర్‌‌ చేసింది. మొదటిది.. ఒక్కో ఫ్యామిలీకి రూ.15 లక్షల ఆర్థిక సాయం కాగా, రెండోది ఐదు ఎకరాల భూమితో పాటు గృహ వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది. 

వటవర్లపల్లి 671 కుటుంబాలు ఉండగా.. ఇందులో 311 మంది నగదు, 360 మంది పునరావాసం, సల్కలపల్లిలో 324 కుటుంబాలకుగానూ 205 మంది నగదు, 119 మంది పునరావాసం, కుడిచింతల బైలులో 260 కుటుంబాలకు 166 మంది నగదు, 94 మంది పునరావాసం, కొల్లంపెంటులో 40 కుటుంబాలకు 21 మంది నగదు, 19 మంది పునరావాసం, తాటిగుండల పెంటలో 25 కుటుంబాలు ఉండగా అందరూ పునరావాస ప్యాకేజీని ఎంచుకున్నారు. 

నగదు కోరుకున్న ఫ్యామిలీల అకౌంట్లలో డబ్బులను డిపాజిట్‌‌ చేయగా..  పునరావాసం కోరుకున్న వారికి బాచారం ప్రాంతంలో 1501.88 హెక్టార్ల భూమిని కేటాయించింది. పునరావాస గ్రామంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించనున్నారు. బాచారం ప్రాంతంలో ఇప్పటికే  మైక్రో ప్లానింగ్‌‌ పూర్తయింది. మౌలిక వసతుల కల్పన కొనసాగుతోంది. ‘కొత్త స్థలం, కొత్త గ్రామం, కొత్త ఆరంభం’ అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రక్రియ తమను మెరుగైన జీవనోపాధి వైపు తీసుకెళ్తుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

పారదర్శకంగా తరలింపు ప్రక్రియ

పునరావాస ప్రక్రియ నేషనల్‌‌ టైగర్ కన్జర్వేషన్‌‌ అథారిటీ (ఎన్‌‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా జరుగుతోందని, దీనిపై ఎస్‌‌డీఎల్‌‌సీ, డీఎల్‌‌సీ కమిటీల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పునరావాస కమిటీ సభ్యులు చెప్తున్నారు. అడవిలో ఉంటే తమ పిల్లలకు మంచి చదువు, వైద్యం దక్కవని గుర్తించిన గ్రామస్తులు.. పునరావాసం కోసం స్వచ్ఛందంగా ఊళ్లను ఖాళీ చేస్తామని, తమకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

 ప్రజల కోరిక మేరకు అడవిలో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేశారు. చెంచుల కోరిక నెరవేరుతున్న తరుణంలో  దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.