బంధువుల చెంతకు సాత్విక్

బంధువుల చెంతకు సాత్విక్

పద్మారావునగర్, వెలుగు:  ఓ వైపు తల్లి ఐసీయూలో ట్రీట్​మెంట్ ​పొందుతుంటే, మరో వైపు తండ్రి ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో ఏకాకిగా మారిన ఆరేండ్ల బాలుడిని ఆస్పత్రి సిబ్బంది అతడి బంధువులకు అప్పజెప్పారు.  మేనత్త,  పెద్దమ్మకు సోమవారం బాలుడిని అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్​కు చెందిన మాధవి(30)ని రెండో కాన్పు కోసం ఆమె భర్త గంగాధర్ ఈ నెల1న గాంధీ దవాఖానాకు తీసుకువచ్చి అడ్మిట్​ చేశాడు.

ఆరేండ్ల కొడుకు సాత్విక్​(6) కూడా వీటి వెంట వచ్చాడు. తర్వాతి రోజు డెలివరీ టైమ్​లో శిశువు పుట్టి చనిపోగా, మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే భార్య, కొడుకుని వదిలేసి గంగాధర్​ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు అర్ధరాత్రి సాత్విక్​ దవాఖానాలో ఒంటరిగా తిరుగుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి గార్డురూమ్​కు తీసుకొచ్చారు.

బాలుడు వివరాలు సరిగ్గా చెప్పకపోవడంతో అతడ్ని చేరదీసి, వారంరోజులుగా అతడి ఆలనాపాలన చూస్తున్నారు. పత్రికల్లో వార్తలు చూసిన నిజామాబాద్​లోని బాలుడి మేనత్త, పెద్దమ్మ సోమవారం గాంధీకి రాగా.. పోలీసుల సమక్ష్యంలో సెక్యూరిటీ సిబ్బంది బాలుడిని వారికి అప్పగించారు. ఎంఐసీయూలో ట్రీట్​మెంట్​​పొందుతున్న మాధవితో మాట్లాడి సాత్విక్​ను తీసుకొని ఊరికి  వెళ్లిపోయారు.

తీవ్ర అస్వస్థత నుంచి కోలుకుం టున్న మాధవి రెండ్రోజుల్లో డిశ్చార్జి కానున్నట్లు  డాక్టర్లు తెలిపారు. గంగాధర్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తోం దని, మిస్సింగ్​ కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.