హైదరాబాద్ గచ్చిబౌలిలో తీరని విషాదం చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలోని ఒక ఉమెన్స్ పీజీ హాస్టల్‌లో ఓ బాలిక లిఫ్ట్ లో ఇరుక్కుని మృతి చెందింది. అసలేం జరిగిందంటే.? వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి.. గౌలిదొడ్డిలోని మహి ఉమెన్స్ పీజీ హాస్టల్ లో వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన ఐదేళ్ల చిన్నారి బిస్తూ గోష్, స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మే 13న ఈరోజు ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ ఆ చిన్నారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఐదో అంతస్తుకు వెళ్తున్న క్రమంలో.. మూడవ అంతస్తు వద్ద చిన్నారి జుట్టు లిఫ్ట్ డోర్లలో ఇరుక్కుపోయింది. అది గమనించేలోపే లిఫ్ట్ కదలడంతో.. చిన్నారి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా.. పోలీసులు, హైడ్రా, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి మృతదేహాన్ని అత్యంత శ్రమతో బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఐదేళ్ల చిన్నారి కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
