
మూసీకి వరద ఉధృతి కొంతమేర తగ్గింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి మొత్తం15 వేల 600 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. నిన్న రాత్రి( సెప్టెంబర్ 26) అత్యధికంగా జంట జలాశయాల నుంచి 36 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు అధికారులు. నిన్న రాత్రితో పోలిస్తే మూసీ వరద ఇవాళ సగానికి తగ్గింది. జంట జలాశయాలకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో తగ్గడంతో అవుట్ ఫ్లో తగ్గించారు జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ కి 9 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 9వేల200 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ కి 7 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 6 వేల 400 క్యూసెక్కుల అవుట్ ఫ్లో విడుదల చేస్తున్నారు అధికారులు. జంట జలాశయాల నుంచి విడుదలవుతున్న అవుట్ ఫ్లో తగ్గడంతో.. కొంతమేర ఊపిరి పీల్చుకుంటున్నారు మూసి పరివాహక ప్రాంత ప్రజలు.
మూసీ వరద ప్రాంతాల్లో పొన్నం..
మరో వైపు మూసీ వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటించారు. చాదర్ ఘాట్ బ్రిడ్జ్ దగ్గర వరద తీవ్రతను పరిశీలించారు. మూసీ వరద తీవ్రత తగ్గిందని.. మూసీ పరివాహక ప్రాంతాల్లో అలెర్ట్ గా ఉండాలని మొదటి నుండి చెప్పామన్నారు మంత్రి పొన్నం. పూర్తిగా వరద తగ్గిన తర్వాత బ్రిడ్జి పై వాహనాలకు అనుమతి ఇస్తామని.. దీనికి పబ్లిక్ సహకరించాలి అని అన్నారు. ప్రకృతిని అంచనా వేయలేం కాబట్టి వరదల వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ నుంచి వస్తున్న వరద కారణంగా మూసీకి వరద పెరిగిందని చెప్పారు. ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారిని పునరావాస కేంద్రాలకి తరలించామన్నారు.