న్యూఢిల్లీ: ఫ్లోరిష్ స్టే హోటల్ అగ్నిప్రమాదం కేసులో కీలకమైన విషయాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. హోటల్ యజమాని లవకేశ్ బజాజ్ (60).. గతంలో బంగ్లాదేశ్ పౌరులకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేవలం డబ్బుల కోసం అతను తన సొంత అడ్రస్ తో విదేశీయులకు నకిలీ గుర్తింపు పత్రాలు తయారు చేసి ఇచ్చాడని, వారు దేశ రాజధానిలో అక్రమంగా నివసించేందుకు సహకరించాడని వెల్లడైంది.
గతేడాది జనవరిలో సెంట్రల్ ఢిల్లీలోని పహార్‌గంజ్ ప్రాంతంలో ఓ బంగ్లాదేశ్ కుటుంబం అక్రమంగా నివసిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు పహార్గంజ్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ ఒక మహిళ, ఆమె కుమార్తె, మైనర్ మనవడు నివసిస్తున్నట్లు గుర్తించారు. వారిని బంగ్లాదేశ్ కు చెందిన స్వీటీ సర్కార్, పుష్పో సర్కార్‌లుగా నిర్ధారించారు. వారి వద్ద ఉన్న పత్రాలను తనిఖీ చేయగా.. రెండు బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లతో పాటు నకిలీ భారతీయ పాస్‌పోర్ట్, పలు నకిలీ ఆధార్ కార్డులు లభ్యమయ్యాయి.
వేర్వేరు పేర్లతో ఉన్న ఆ డాక్యుమెంట్లన్నింటిపై ఒకే మహిళ ఫొటో ఉంది. వీటిలో ఒక నకిలీ పాస్‌పోర్ట్‌లోని సౌత్ ఢిల్లీ చిరునామాను పోలీసులు తనిఖీ చేయగా.. అది ఫ్లోరిష్ స్టే హోటల్ ఓనర్ లవకేశ్ బజాజ్ సొంత ఇల్లు అని తేలింది. ఈ కేసులో లవకేశ్ తిహార్ జైల్లో 15 రోజులు ఉండి, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.
షార్ట్ సర్క్యూటే కారణం..
ఫ్లోరిష్ స్టే హోటల్‌లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తేల్చారు. మాలవీయ నగర్‌లోని ఈ హోటల్‌కు ఎటువంటి ఫైర్ ఎన్వోసీ లేవు. భవనానికి ఒకే ఒక ఎంట్రన్స్ ఉండటం, కిటికీలన్నీ పూర్తిగా సీల్ చేసి ఉండటంతో ప్రాణనష్టం పెరిగిందన్నారు.
