కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం.. చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేయడమే కాకుండా, అసలు ఇది ఎలా సాధ్యం? అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సర్రే-డెల్టా సరిహద్దులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ యాక్సిడెంట్‌లో ఒక మోటార్‌సైకిల్ ఏకంగా గాలిలో ట్రాఫిక్ సిగ్నల్ లైటుకు వేలాడుతూ కనిపించింది. హాలీవుడ్ యాక్షన్ సినిమా సీన్‌ను తలపించే ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 72వ అవెన్యూ,120వ వీధి జంక్షన్ వద్ద ఒక కారు, మోటార్‌సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఎంత భీభత్సంగా జరిగిందంటే.. బైకర్ ఎగిరి కింద పడగా, అతడి బైక్ మాత్రం గాలిలోకి లేచి వెళ్లి రోడ్డుపై ఎత్తులో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పోల్ లైట్లకు చిక్కుకుపోయింది.
అటుగా వెళ్తున్న విలియం చాన్ అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. రోడ్డు మధ్యలో ధ్వంసమైన కారును చూసి ప్రమాదం జరిగిందని అర్థమైంది. కానీ ఆ తర్వాత తల పైకెత్తి చూడగానే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ వేలాడుతూ కనిపించింది. కన కళ్లను తానే నమ్మలేకపోయానని అతను మీడియాకు తెలిపాడు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని డెల్టా పోలీస్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది. కారు డ్రైవర్ మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.
గాలిలో వేలాడుతున్న బైక్‌ను కిందకు దించేందుకు, రోడ్డుపై పడిన శిథిలాలను తొలగించేందుకు ఎమర్జెన్సీ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్కాట్ రోడ్డులోని కీలక విభాగాలను పోలీసులు మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద తీవ్రతకు బైక్ అంత ఎత్తుకు ఎలా వెళ్లిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
