- నోయిడాలో కమ్ముకున్న పొగమంచు.. ఒకదానినొకటి ఢీకొట్టిన 12 వెహికల్స్
- మహిళ సహా పలువురికి గాయాలు.. స్పీడ్ లిమిట్లు సవరణ
- ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం.. సివియర్ స్థాయికి చేరువలో ఏక్యూఐ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై శనివారం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో దాద్రిలోని చక్రసైన్‌పూర్ గ్రామ సమీపంలో దాదాపు 12 నుంచి 15 వాహనాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. మంచు వల్ల రోడ్డు విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో మహిళలతో సహా పలువురు గాయపడ్డారు. వాహనాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని కార్లు డివైడర్‌పై ఎక్కి ఆగిపోవడంతోపాటు, ట్రక్కులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ప్రమాదం కారణంగా ఎక్స్ ప్రెస్‌వే పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న దాద్రి పోలీసులు, టోల్ సిబ్బంది తక్షణమే స్పందించారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
దెబ్బతిన్న వాహనాలను క్రేన్ల సాయంతో తొలగించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. దట్టమైన మంచు, స్మాగ్ కారణంగా రోడ్డు విజిబిలిటీ తీవ్రంగా తగ్గడంతో ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ ప్రెస్‌వేలపై కొత్త స్పీడ్ లిమిట్లు విధించారు. నోయిడా- ఎక్స్ ప్రెస్‌వేతోపాటు యమునా ఎక్స్ ప్రెస్‌వేపై లైట్ వెహికల్స్ కు 75 కి.మీ./గం., హెవీవెహికల్స్ కు 50 నుంచి -60 కి.మీ./గం. మాత్రమే అనుమతిచ్చారు. సవరించిన పరిమితులు ఫిబ్రవరి 15 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు. తక్కువ విజిబిలిటీ ఉన్న ప్రాంతాల్లో ఫాగ్ ల్యాంప్‌లను ఉపయోగించాలని, సడెన్ లేన్ చేంజెస్ నివారించాలని డ్రైవర్లకు సూచించారు.
ఢిల్లీలో విపరీతంగా పెరిగిన గాలి కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీని శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం.. ఉదయం 8 గంటలకు ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 397గా నమోదైంది. ఇది 'వెరీ పూర్' కేటగిరీలో ఉండగా.. 'సివియర్' (401–500) స్థాయికి చాలా దగ్గరగా ఉంది.
నగరంలోని మొత్తం మానిటరింగ్ స్టేషన్లలో 21 చోట్ల ఏక్యూఐ 400 మార్కును దాటి 'సివియర్' కేటగిరీలో నమోదైంది. అత్యధికంగా వజీర్‌పూర్‌లో 445, వివేక్ విహార్‌లో 444, జహంగీర్‌పురిలో 442, ఆనంద్ విహార్‌లో 439, అశోక్ విహార్, రోహిణీలో 437 చొప్పున ఏక్యూఐ నమోదైంది. అలాగే, నరేలాలో 432 , ప్రతాప్‌గంజ్‌లో 431, ముండ్కాలో 430, బవానా, ఐటీఓ, నెహ్రూ నగర్‌లలో 429 చొప్పున ఏక్యూఐ రికార్డయ్యింది.
దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తీవ్రంగా తగ్గడంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో లో విజిబిలిటీ ప్రొసీజర్స్ అమలులోకి వచ్చాయి. అయినప్పటికీ విమానాలు సాధారణంగానే నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్‌సీఆర్, పక్కనే ఉన్న ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) స్టేజ్-3ని అమలు చేసింది. ఇందులో నిర్మాణ పనుల నియంత్రణ, కొన్ని వాహనాలపై ఆంక్షలు వంటి అత్యవసర చర్యలు ఉంటాయి.
