ఈతకెళ్లిన ఫుట్​బాలర్ను చంపేసిన మొసలి.. నది మొత్తం రక్తసిక్తం

ఈతకెళ్లిన ఫుట్​బాలర్ను చంపేసిన మొసలి..  నది మొత్తం రక్తసిక్తం

యువ ఫుట్​బాలర్ పై మొసలి దాడి చేయడంతో అతను చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోస్టారికాలో జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం.. జీసస్​ అల్​బెర్టో లోపేజ్ ఒర్టిజ్(29)​అనే ఫుట్​బాలర్​ని అందరూ ముద్దుగా చుచో అని పిలుస్తారు. 

అతను స్థానికంగా ఉన్న నదిలో స్విమ్మింగ్​చేసేందుకు దిగారు. కానీ అదే తన చివరి రోజవుతుందని ఊహించలేదు. ఈత కొడుతున్న అతన్ని పెద్ద మొసలి పసిగట్టింది. వేగంగా వచ్చి చుచోని తన నోటితో గట్టిగా పట్టేసుకుంది. దీంతో అతను తప్పించుకోవడానికి వీళ్లేకుండా పోయింది. 

షాక్​ లో ఉన్న చుచో దాని నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ మొసలి విడిచిపెట్టలేదు. చివరికి మొసలి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని మృతదేహాన్ని మొసలి నోట కరచుకుని ఈదుతున్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​అయ్యాయి. నది మొత్తం రక్తసిక్తంగా మారడంతో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఫొటోలు చూసి కొందరు గన్​లతో అక్కడికి వెళ్లారు. మొసలిని కాల్చి చంపి చుచో డెడ్​బాడీని బయటకు తీశారు. 

చుచో కొన్ని రోజులుగా డిపోర్టివో రియో క‌న‌స్ జ‌ట్టు తరఫున ఆడుతున్నాడు. 'అతని అకాల మరణం మమ్మల్ని షాక్​కి గురి చేసింది. చుచో ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం' అని ఫుట్​బాల్​జట్టు ప్రకటనలో వెల్లడించింది. జట్టు సభ్యులు అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు డబ్బులు కలెక్ట్​ చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. చుచో అంతర్జాతీయంగా ఫుట్​బాల్​ ఆటలో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో విషాదం జరగడం క్రీడాభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది.