V6 News

వాహనాలు రాలే.. ఆయుధాలివ్వలే.. విధి నిర్వహణలో ఫారెస్ట్‌‌‌‌ సిబ్బంది ఇబ్బందులు

వాహనాలు రాలే.. ఆయుధాలివ్వలే.. విధి నిర్వహణలో  ఫారెస్ట్‌‌‌‌ సిబ్బంది ఇబ్బందులు
  • విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్న ఫారెస్ట్‌‌‌‌ సిబ్బంది
  • ఆక్రమణలు, అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో దాడులు.. గాయాలపాలవుతున్న ఉద్యోగులు
  • వెహికల్స్‌‌‌‌ లేకపోవడంతో ఇబ్బందిగా మారిన క్షేత్రస్థాయి పర్యవేక్షణ
  • సిబ్బంది కొరతతో ఉన్న వారిపైనే పనిభారం

హైదరాబాద్, వెలుగు : అడవులు ఆక్రమణకు గురి కాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సిబ్బందికి ఆయుధాలు, వాహనాలు లేకపోవడంతో విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటవీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లర్ల దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్యూటీ చేస్తున్నారు. మరో వైపు బీట్‌‌‌‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌‌‌‌ బీట్‌‌‌‌ ఆఫీసర్లు, సెక్షన్‌‌‌‌ ఆఫీసర్ల కొరత కారణగా ఉన్న సిబ్బందిపైనే పనిభారం పడుతుండడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక మహిళా బీట్‌‌‌‌ ఆఫీసర్ల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. అటవీ శాఖలో మహిళా బీట్‌‌‌‌ ఆఫీసర్ల సంఖ్య పెరిగినా... వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

వేల సంఖ్యలో ఖాళీలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,652 మంది బీట్‌‌‌‌ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 2,347 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో పురుషులు 1,352, మహిళలు 995 మంది ఉన్నారు. 1,450 బీట్​ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్‌‌‌‌ బీట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టులు 1,800 మంజూరు కాగా.. ఇందులో సుమారు 900 మంది పనిచేస్తుండగా.. మరో 900 వరకు ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఇక సెక్షన్‌‌‌‌ ఆఫీసర్లు 1,200కు పైగా ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 800 మంది విధులు నిర్వర్తిస్తున్నారని, మరో 400కు పైగా పోస్టులు ఉన్నాయని సమాచారం. ఖాళీల కారణంగా ఒక్కో అధికారి ఇద్దరు, ముగ్గురు చేయాల్సిన పని చేయాల్సి వస్తోంది.  దీంతో సెలవులు దొరక్క, కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న బీట్, సెక్షన్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టులను భర్తీ చేయాలని, మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా మొబైల్‌‌‌‌ టాయిలెట్లు, రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ఆఫీసర్లపై పెరుగుతున్న దాడులు

విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై కొన్నేండ్లుగా దాడులు పెరుగుతున్నాయి. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్‌‌‌‌ రేంజ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ శ్రీనివాసరావును గొత్తికోయలు అత్యంత దారుణంగా నరికి చంపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తరచూ బీట్‌‌‌‌ ఆఫీసర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు మారణాయుధాలతో దాడులకు పాల్పడుతుండగా.. అటవీ సిబ్బంది వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో వారిని ఎదుర్కోలేకపోతున్నారు. ఆత్మ రక్షణ కోసం కనీసం గన్‌‌‌‌ కూడా ఇవ్వకపోవడంపై సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి తుపాకులు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించినా.. ఆ ప్రతిపాదన ప్రస్తుతం అటకెక్కింది. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో వారికి తుపాకులతో పాటు శిక్షణ కూడా ఇస్తామని చెప్పినా.. అది కార్యరూపం 
దాల్చలేదు. 

కాలి నడకే దిక్కు..

ఒక్కో బీట్‌‌‌‌ పరిధి సగటున 2 వేల నుంచి 4 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. ప్రభుత్వం ఉన్నతాధికారులకు వాహనాలు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే బీట్‌‌‌‌ ఆఫీసర్లకు మాత్రం మోటార్‌‌‌‌ సైకిళ్లు ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం వాహనాలు సమకూర్చకపోవడంతో ఆఫీసర్లు సొంత బైకులపై అడవిలో తిరుగుతున్నారు. రాళ్లురప్పల మధ్య ప్రమాదాలకు గురై గాయపడిన వారికి చికిత్స కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి లోపలికి వెళ్తే కమ్యూనికేషన్‌‌‌‌ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అధికారులకు సమాచారం అందించేందుకు వాకీటాకీలు కూడా పనిచేయడం లేదని సిబ్బంది చెప్తున్నారు. అడవిలో నెట్‌‌‌‌వర్క్  ఉండదని, కమ్యూనికేషన్ సెట్లు పనిచేయడం లేదంటున్నారు.  ప్రభుత్వం స్పందించి అటవీ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.