హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ నూతన మహిళా విభాగం ఏర్పాటైంది. బుధవారం లక్డీకపూల్‌లోని ఆఫీసులో జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు బాధ్యతలు స్వీకరించిన కన్వీనర్ డాక్టర్ కె . అనిత సమక్షంలో పీఆర్‌ఎస్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వై. బాబ్జీ.. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్జీవో, జర్నలిజం, మేనేజ్‌మెంట్ చెందిన పీఆర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ నిపుణులను తీసుకురావాలనే లక్ష్యంతో మొదటిసారిగా మహిళల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందించడానికి తమకు ఓ గొప్ప అవకాశం లభించిందని, సభ్యత్వాన్ని మెరుగుపరచడంతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక మహిళా విభాగం ఏర్పాటుకు ముందుండి సహకరించిన హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ రాము సూరవజ్జులను పీఆర్ఎస్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి బాబ్జీ అభినందించారు. నూతనంగా ఎన్నికైన వారిలో కో -కన్వీనర్‌గా డాక్టర్ శ్రీ బాల, కో ఆర్డినేటర్ సి. ధన్య శ్రీ తదితరులు ఉన్నారు.
