V6 News

మాజీ సీఎం నాదెండ్లకు తుది వీడ్కోలు

మాజీ సీఎం నాదెండ్లకు తుది వీడ్కోలు
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో 
  • భాస్కర్​రావుది కీలక పాత్ర: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్​రావు అంత్యక్రియలు గురువారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఆయన పెద్ద కుమారుడు నాదెండ్ల మురళి తండ్రి చితికి నిప్పంటించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని భాస్కర్​రావు నివాసంలో ఆయన పార్థివదేహానికి తెలంగాణ, ఏపీకి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ కేకే, ఏపీ మంత్రులు కందుల దుర్గేశ్, సవిత, కొండపల్లి శ్రీనివాస్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, రాంచందర్ రావు, సుప్రీంకోర్టు మాజీ జడ్జి చలమేశ్వర్ తదితరులు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబసభ్యులను ఓదార్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి, గౌరవ వందనం సమర్పించారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో నాదెండ్ల భాస్కర్ రావు కీలక పాత్ర పోషించారని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఆయన చూపిన నిబద్ధత,  భావితరాలకు ఆదర్శమన్నారు. తెలుగు ప్రజలు ఆయన సేవలను చిరకాలం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.