నేను మాట్లాడిన శక్తి మతం గురించి కాదు :  రాహుల్ 

నేను మాట్లాడిన శక్తి మతం గురించి కాదు :  రాహుల్ 
  • అధర్మం, అవినీతి, అబద్ధాలపైనేనని క్లారిటీ

న్యూఢిల్లీ :  ప్రధాని మోదీ తన మాటలను వక్రీకరించారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్​ అయ్యారు. తాను‘శక్తి’ అని మాట్లాడింది మతపరమైన శక్తి గురించి కాదని.. అధర్మం, అసత్యం, అవినీతి, అబద్ధాల శక్తి గురించి అని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం న్యాయ్​యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మోదీకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటం వ్యక్తిగతం కాదు.. శక్తి (అధికారం) కోసం పనిచేసే ముసుగే మోదీ.. దానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నాం..’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై సోమవారం జగిత్యాలలో జరిగిన సభలో ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ఇండియా కూటమి సభ్యులు తమ పోరాటం 'శక్తి'పై అంటున్నారు. నాకు ప్రతి తల్లి, ప్రతి కూతురు శక్తి స్వరూపం. వారి భద్రత కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను" అని మోదీ అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై రాహుల్ ఎక్స్​ వేదికగా మండిపడ్డారు. మోదీకి తన మాటలు నచ్చవని, ఎప్పుడూ ఏదో ఒక విధంగా వాటిని వక్రీకరించి వాటి అర్థాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారని ఆయన విమర్శించారు.

కానీ, తాను లోతైన సత్యం మాట్లాడానని మోదీకి తెలుసు అన్నారు. ‘‘నేను చెప్పిన శక్తి.. మనం పోరాడుతున్న శక్తి.. అధికారం. ఆ శక్తి ముసుగే మోదీ. ఆ శక్తి నేడు దేశ స్వరాన్ని, సీబీఐ, ఐటీ, ఈడీ, ఎన్నికల సంఘం, మీడియా, భారతీయ పరిశ్రమ, మొత్తం రాజ్యాంగ నిర్మాణాన్ని తన కబంధ హస్తాల్లో బంధించింది” అని రాహుల్ ​మండిపడ్డారు.