డిజైన్ లోపంతోనే చెక్ డ్యాంలు కూలినయ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్

డిజైన్ లోపంతోనే చెక్ డ్యాంలు కూలినయ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: వరద ఎంత వస్తుందనే అంచనా లేకుండా ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్  లోపంతోనే చెక్ డ్యామ్ లు కూలిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇంజనీర్లదే తప్పిదమని, విజిలెన్స్  ఎంక్వైరీ లో ఎవరి తప్పిదం ఉన్నా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. దళితబంధు లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఎస్డీఎఫ్​ ఫండ్స్ తో చేపట్టిన పనులను కొనసాగించాలని కోరుతూ శనివారం కరీంనగర్  కలెక్టర్ పమేలా సత్పతికి బీఆర్ఎస్  నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్  జిల్లా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాకు ఇన్ చార్జి మంత్రి, జిల్లా మంత్రి రావడం లేదన్నారు. 

కరీంనగర్ ను కళావిహీనం చేశారని, మళ్లీ పాత కరీంనగర్  కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అస్యూరెన్స్  ఫండ్స్ తో చేపట్టిన సీసీ రోడ్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయని, వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్  లైట్లు వెలగడం లేదన్నారు. లంచాలు తీసుకుని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని, అనర్హులకు ఇండ్లు ఇస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

కరీంనగర్  కంపు కొడుతోందని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సందర్శించినా డంప్ యార్డ్  ప్రాబ్లం పరిష్కారం కాలేదని, ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కోరారు. హుజురాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, బీఆర్ఎస్  జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్  పాల్లొన్నారు.