కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఊహాజనితమే: గంగుల

కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఊహాజనితమే: గంగుల

కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది. బీఆర్ఎస్ హైకమాండ్‎పై అసంతృప్తిగా ఉన్న ఆమె.. త్వరలోనే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి కొత్త దుకాణం పెడతారంటూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. ఆదివారం (మే 25) ఆయన కరీంనగర్‎లోని ఆరెపల్లిలో స్మశానవాటిక అభివృద్ధి, వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. 

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఊహాజనితమేనని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే.. పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని.. ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చని ఇప్పటికే కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాకపోతే అవి బహిరంగంగా చెప్పకూడదన్నదే కేటీఆర్ అభిప్రాయమని.. దాంతో మేము ఏకీభవిస్తున్నాని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2న ఈసారి మా పార్టీ తరఫున అమెరికాలోని డల్లాస్‎లో నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమానికి కేటీఆర్‎తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది హాజరు అవుతారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి నేను, కౌశిక్ రెడ్డి, రసమయి బాలకిషన్ వెళ్తున్నామని చెప్పారు. ఈనెల 26న న్యూయార్క్ వెళ్లి జూన్ 2న డల్లాస్‎లో జరిగే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటామన్నారు. అయితే.. కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఊహాజనితమే అంటూనే.. కొత్త పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందంటూ గంగుల చేసిన కామెంట్స్ గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.