కాంగ్రెస్ సీనియర్లు క్యాడర్‭ను పరేషాన్ చేస్తున్రు: ఈరవర్తి అనిల్

కాంగ్రెస్ సీనియర్లు క్యాడర్‭ను పరేషాన్ చేస్తున్రు: ఈరవర్తి అనిల్

పీసీసీ కమిటీల్లో 50 శాతం టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్లు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ స్పందించారు. కాంగ్రెస్ సీనియర్లు చెప్పినవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశారు. పీఏసీలో, ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే కమిటీ వేశారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒకవైపు పార్టీ బలోపేతానికి రాహుల్ పాదయాత్ర చేస్తుంటే.. సీనియర్లు ఇలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోడీని ఎందుకు కలిశారో చెప్పాలని ఈరవర్తి అనిల్ డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం వెంకట్ రెడ్డి పనిచేయలేదా అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు సీనియర్లు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు కాదా అని ప్రశ్నించారు. రేవంత్ వలస నాయకుడని జగ్గారెడ్డి ఎట్లా అంటారని అనిల్ మండిపడ్డారు. సీనియర్ నేతలు ఇలా చేయడం వల్ల క్యాడర్ పరేషాన్ అవుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై పోరాటం చేయాలె తప్ప ఇలాంటి చర్యలు సరికావని అన్నారు. మనమంతా ఒకే కుటుంబం కలిసి పనిచేద్దాం అని ఈరవర్తి అనిల్ అన్నారు.