
సరెండర్ మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తలేరు
కొత్త లొంగుబాట్లపై ఎఫెక్ట్
ప్యాకేజీ కోసం తప్పని ఎదురుచూపులు
చాలామందికి దక్కని ఇంటి స్థలాలు, సాగుభూములు
ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న మాజీ నక్సలైట్లు
ఆదిలాబాద్, వెలుగు: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న క్యాష్రివార్డుతో పాటు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలుకావడం లేదు. సర్కారు మాటలు, పోలీసుల ప్రకటనలు నమ్మి లొంగిపోతున్న మాజీ నక్సలైట్లకు చివరకు ఉత్త చేతులే మిగులుతున్నాయి. ఈక్రమంలో ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతున్న పలువురు మాజీ మావోయిస్టులు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారు.
అందని పునరావాస ప్యాకేజీ
ప్రభుత్వ ప్రకటనలకు స్పందించి తెలంగాణ వ్యాప్తంగా గత పదేళ్లలో వంద మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో కీలకపాత్ర పోషించనవాళ్లు కూడా ఇందులో ఉన్నారు. అనారోగ్య కారణాలు, పార్టీ సిద్ధాంతాల విషయంలో విభేదాల్లాంటి కారణాలతో లొంగిపోతున్నవారూ తక్కువేమీ లేరు. ఇలా జనంలోకి వచ్చిన మావోయిస్టులను ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లొంగిపోతున్న మావోయిస్టుల్లో చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవారే. ఉండడానికి ఇల్లు, సాగుభూమిలాంటివి లేనివారే. దీంతో గత ప్రభుత్వాలు పునరావాస ప్యాకేజీలో భాగంగా ఆయా మావోయిస్టులపై ఉన్నక్యాష్రివార్డులతో పాటు ఇంటి స్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ వచ్చాయి. కొన్నాళ్లపాటు ఇది సక్రమంగానే అమలైనప్పటికీ తెలంగాణ వచ్చాక అమలు కావడం లేదని, దీంతో తమకు పూటగడవడం కష్టంగా మారుతోందని మాజీ మావోయిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ మొదలైన మావోయిస్టుల కార్యకలాపాలు
తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. ఉద్యమం విస్తరించకుండా పోలీసులు సరిహద్దు జిల్లాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. అదే టైంలో మావోయిస్టుల సరెండర్ కోసం పోలీస్ ఉన్నతాధికారులే రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల డీజీపీ మహేందర్రెడ్డి ఆసిఫాబాద్లో నాలుగురోజులు తిష్టవేసిన టైంలో పోలీస్ఆఫీసర్లు మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఆడెల్లు అలియాస్ భాస్కర్, ఆయన భార్య కంతి లింగవ్వ లొంగుబాటు కోసం వాళ్ల కుటుంబసభ్యుల ద్వారా ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సరెండర్అయితే భారీ పునరావాస ప్యాకేజీ ఇస్తామనే ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికే లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు పునరావాసం సక్రమంగా అందడం లేదనే ప్రచారం జరుగుతోంది. నిర్మల్లో మాజీ మావోయిస్టు దంపతులు ఏకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలపడంలాంటి ఘటనలు కొత్త మావోయిస్టుల లొంగుబాట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ మాజీ మావోయిస్టు దంపతులు. నిర్మల్ జిల్లా మామడ మండలం బురదపల్లి గ్రామానికి చెందిన మార్గం సునీల్, ఆయన భార్య గంగుబాయి అలియాస్ లత నాలుగేళ్ల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ చత్తీస్ గఢ్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వీరికి ఇప్పటివరకు ఇంటి స్థలం, వ్యవసాయ భూమి కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆఫీసర్ల తీరుకు నిరసనగా ఇటీవలే ఇద్దరూ నిర్మల్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మాజీ మావోయిస్టు పేరు సట్వాజీ. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన ఈయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జిగా కీలక పదవుల్లో కొనసాగి, ఏడాదిన్నర క్రితం ఆయన భార్యతో కలిసి సరెండర్ అయ్యాడు. ఆ టైంలో క్యాష్ రివార్డుతో పాటు ఇంటి స్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇస్తామన్నారు. క్యాష్ రివార్డు తప్ప ఇప్పటివరకు మిగితా పునరావాస ప్యాకేజీ అందలేదు. దీంతో ఇంటి స్థలం, వ్యవసాయ భూమి కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
For More News..