అసంతృప్తులను బుజ్జగించేందుకు త్రిసభ్య కమిటీ

అసంతృప్తులను బుజ్జగించేందుకు త్రిసభ్య కమిటీ

నల్గొండ, వెలుగు: మునుగోడుకు బై ఎలక్షన్​ వస్తే  టీఆర్ఎస్​ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిని బరిలో దింపాలని హైకమాండ్​ దాదాపు నిర్ణయించడంతో దీనిని అడ్డుకునేందుకు ఆయన వ్యతిరేక వర్గం రంగంలోకి దిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ  కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే తాము సహకరించబోమంటూ పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్​కు లెటర్​ రాయడం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మినహా మిగిలిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు అందరూ కూసుకుంట్లకు వ్యతిరేకంగా వాయిస్​ వినిపిస్తున్నారు. ఇటీవల వీళ్లంతా కలిసి కూసుకుంట్లకు వ్యతిరేకంగా కేటీఆర్​కు లెటర్​ రాయడంతో అప్రమత్తమైన హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కూసుకుంట్ల సహా ఆశావహులు ఎవరూ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు పర్యటించవద్దని, ప్రెస్​మీట్​లు కూడా పెట్టవద్దని ఆదేశించింది. హైకమాండ్ ​కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతుండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందే అసంతృప్తులను బుజ్జగించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు కూసుకుంట్ల వ్యతిరేక వర్గీయులతో, అసంతృప్తి నేతలతో రాయబారం నడిపిస్తుండడంతో అసంతృప్తులను ఎలా దారిలోకి తెస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

సాగర్​ తరహాలో ఆపరేషన్..

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ముందు అవలంబించిన వ్యూహాన్నే మునుగోడులోనూ పార్టీ హైకమాండ్ అమలు చేస్తోంది. సాగర్ ​బై ఎలక్షన్స్​ టైంలోనూ ఎమ్మెల్యే నోముల భగత్ అభ్యర్థిత్వాన్ని చాలామంది లీడర్లు వ్యతిరేకించారు. జానారెడ్డిని ఢీకొట్టడం భగత్ వల్ల కాదని సొంత పార్టీ  నేతలే ప్రచారం చేశారు. దీంతో భగత్ కు టికెట్ ఇస్తున్నట్లు ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డ హైకమాండ్​పలు సర్వేలు చేయించింది. అసంతృప్తులను దారికి తేవడంతోపాటు ఇతర వ్యవహారాలన్నీ చక్కబెట్టాకే చివరి నిమిషంలో భగత్ పేరును ప్రకటించింది. ఇప్పుడు మునుగోడులోనూ అదే సీన్ రిపీట్ అవుతోందని రూలింగ్​పార్టీ నాయకులు అంటున్నారు. ఇక్కడ కూడా కూసుకుంట్లకు ఇవ్వద్దనే వాయిస్ బలంగా వినిపిస్తుండటంతో హైకమాండ్​ ముందుగానే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మునుగోడులో గాడి తప్పిన పార్టీ నాయకత్వాన్ని చక్కబెట్టే పనిలో పడింది. ఇందులో భాగంగా సాగర్ బాధ్యతలు చూసిన ముగ్గురు నేతలకే మునుగోడు బాధ్యతనూ అప్పగించింది. జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి, పార్టీ జిల్లా ఇన్​చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో త్రిసభ్య కమిటీ నియమించింది. రెండు రోజుల నుంచి కూసుకుంట్లకు వ్యతిరేకంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను హైదరాబాద్​కు పిలిపించి కమిటీ సభ్యులు చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

అసంతృప్తుల వెనుక ఎవరు?

నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలన్నింటినీ ఓ వైపు మంత్రి  జగదీశ్​రెడ్డి సరిదిద్దే ప్రయత్నాలు చేస్తుండగానే.. మరోవైపు అసంతృప్తులను రెచ్చగొట్టడం వెనకాల ఎవరి హస్తం ఉండొచ్చనే కోణంలో హైకమాండ్ ఆరా తీస్తోంది. టికెట్ ఆశిస్తున్న పలువురు సీనియర్ నేతలు కూసుకుంట్ల వ్యతిరేక వర్గీయులతో ఇటీవల సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే తమకు లైన్ క్లియర్ అవుతుందనే ఆలోచనతో  ఇదంతా చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  బైపోల్ టికెట్ ఆశిస్తున్న బీసీ నేతలంతా ఏకతాటి పైకి వచ్చినట్లు తెలుస్తోంది. కలిసికట్టుగా తమ బలాన్ని చాటుకుంటే తప్ప ఈ ఎన్నికల్లో సీటు దక్కదనే అభిప్రాయంతో వారంతా ఉన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కర్నాటి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి తదితరులు టికెట్ కోసం పట్టుబడుతున్నారు. కర్నె ప్రభాకర్ మినహా మిగిలిన నేతలందరూ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో కలిసికట్టుగానే నియోజకవర్గంలో పర్యటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే  కర్నె ప్రభాకర్ తన స్పీడ్​ తగ్గించినట్లు తెలుస్తోంది. బూర నర్సయ్యగౌడ్​తో కూడా ఒకటి రెండు రోజుల్లో హైకమాండ్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు.